దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. అతి తక్కువ కాలంలోనే అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది ఈ కన్నడ భామ. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలతో కుర్రాళ్లలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. అయితే ఇటీవల ఆమె గురించి ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆమెపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం విధించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలపై శ్రీవల్లి స్పందించింది. కన్నడ చిత్ర పరిశ్రమ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని రష్మిక స్పష్టం చేసింది.
రష్మిక మాట్లాడుతూ.. “కాంతార సినిమా విషయంలో కొందరు నాపై అత్యుత్సాహం చూపించారు. ఆ మూవీ చూశాక.. కాంతార మూవీ టీమ్ కి నేను మేసేజ్ పెట్టాను. నటీనటుల మధ్య జరిగే విషయాలు అన్ని ప్రేక్షకులకు తెలియవు. అలానే నా వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు చూపించలేను. అలాగని నేను నా పర్సనల్ విషయాలను బయటకు చెప్పలేను. అంత అవసరం కూడా లేదనేది నా భావన. నటులకు పెట్టే మెసేజ్ లు బయటకి విడుదల చేయలేను. కేవలం వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అని నా అభిమానులకు చెప్పడం నా బాధ్యత. నాపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎలాంటి నిషేధం విధించలేదు” అని రష్మిక స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం.. ఓ ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ కు రష్మిక మందన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన వ్యక్తిగత జీవితాన్నికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంది. విద్యార్ధిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచానని, అది పేపర్లో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ‘పరంవా’ నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపలేదంటూ పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే కాంతార సినిమాను ఎందరో ప్రముఖులు ప్రశంసిస్తుంటే..రష్మిక మాత్రం అభినందనలు చెప్పలేదంటూ కొందరు ఆరోపించారు. కృతజ్ఞతాభావం లేని ఆమెను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా స్పందించిన రష్మిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ వార్తలకు చెక్ పెట్టింది.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో సైతం ఈ అమ్మడికి బాగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప-2 సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇటీవలే అమితాబ్ బచ్చన్ తో నటించిన ‘గుడ్ బై’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అలానే కోలీవుడ్ లో విజయ్ తో కలిసి వారిసు చిత్రంలో నటిస్తుంది.