ప్రస్తుత కాంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరెంట్ బిల్లులు కట్టడం మొదలు.. ఇంట్లోకి కావాల్సిన సరుకులు, బట్టలు ఇలా ఒక్కటేమిటి.. ప్రతిది ఆన్‌లైన్ నుంచే కొంటున్నాం. ఈ క్రమంలో డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టే సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో.. మన స్నేహితులు, తెలిసిన వారి వాట్సాప్ నంబర్ల నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు రావడం.. ఆ తర్వాత ఆరా తీస్తే.. అలా డబ్బులు అడిగింది వారు కాదని తేలడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. సామాన్యులే కాక సెలబ్రిటీలకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు.
తాజాగా తనకు ఇదే పరిస్థితి ఎదరయ్యింది అంటున్నారు నటి పూర్ణ. తన భర్త ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టిన ఓ నంబర్ నుంచి.. కొందరు లావాదేవీలు జరుపుతున్నారని.. అలా ఎవరైనా మోసపోతే.. అందుకు తన భర్త కారణం కాదంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది పూర్ణ. ప్రసుత్తం ఈ పోస్ట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
హీరోయిన్‌గా, ప్రసుత్తం క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. బుల్లితెర మీద పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజగా ఉంది పూర్ణ. ఇక కొన్ని రోజుల క్రితమే పూర్ణ వివాహం చేసుకుంది. దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని.. పూర్ణ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మధ్య.. దుబాయ్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజుల తర్వాత.. వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూర్ణ. తన భర్త కంపెనీకి సంబంధించిన ఈవెంట్లను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా ప్రమోట్ చేస్తుంది పూర్ణ.
తాజాగా పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. అది తన భర్త పేరుతో జరుగుతున్న సైబర్ మోసానికి సంబంధించిన పోస్ట్. ఇక పూర్ణ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది.. ‘‘+971 52 724 5366 ఫోన్ నంబరు కలిగిన వాట్సాప్ అకౌంట్ ద్వారా నా భర్త షానిద్ పేరుతో ఓ వ్యక్తి.. కొందరిని కాంటాక్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. అయితే అది నా భర్త నంబర్ కాదు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రొఫైల్‌తో మీరు ఏవైనా లావాదేవీలు జరిపితే దానికి నా భర్త బాధ్యుడు కాదు. అలా మీలో ఎవరైనా మోసపోతే.. నా భర్తకు సంబంధం లేదు’’ అని పోస్ట్ చేసింది పూర్ణ.
ఇక పూర్ణ భర్త షానిద్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూఏఈలో పలు లావాదేవీలు నిర్వహిస్తోంది. దుబాయ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులను ఈ కంపెనీ తన వినియోగదారులకు అందిస్తోంది. గోల్డెన్ వీసాలు సైతం ఇప్పిస్తుంది. తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ కూడా పాల్గొంది. ఈ ఈవెంట్‌ను పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లైవ్ ఇచ్చారు. గతంలో ప్రభుదేవాకు కూడా ఇలానే గోల్డెన్ వీసా ఇప్పించారు. ప్రస్తుతం పూర్ణ చేసిన పోస్ట్ వైరలవుతోంది.