బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూపై డీఎంకే నాయకుడు ఒకరు హద్దులు దాటి మాట్లాడారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా స్పందించారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
తమిళనాట రాజకీయాలు మరోసారి జుగుప్పాకరంగా మారాయి. అధికార డీఎంకే పార్టీ నాయకుడు క్రిష్ణమూర్తి.. ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఖుష్బూపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఖుష్బూపై హద్దులు దాటి విమర్శలు చేశారు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. సినిమా పరిశ్రమలో ఖుష్బూ లాంటి నటి ఎవరూ లేరని వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రభుతో ఆమె గతం తాలూకా సంబంధాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై కూడా దారుణంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై డీఎంకే పార్టీ అధిష్టానం హుటాహుటిన స్పందించింది. క్రిష్ణమూర్తిని పార్టీనుంచి శాశ్వతంగా తొలగించింది.
ఇక, ఈ వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా స్పందించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రిష్ణమూర్తిపై ఫైర్ అయ్యారు. ఒకానొక సందర్భంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మహిళల కోసం పోరాటం చేస్తూ ఉన్నాను. అలాంటి నాపై చేసిన ఈ వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా ఉంటే అది తప్పుగా అర్థం అవుతుంది. ‘మీ కోసమే మీరు పోరాడలేకపోయారు. మిగితా ఆడవాళ్ల కోసం ఏం పోరాడతారు?’ అన్న సందేహం వస్తుంది. ఆడవాళ్ల గురించి ఇంత నీచంగా మాట్లాడటానికి ఏ మగాడికీ హక్కులేదు. నేను నాకోసం ఈ మీటింగ్ పెట్టలేదు. దేశంలోని ప్రతీ మహిళ కోసం ఈ మీటింగ్ పెట్టాను.
బయటి ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి కూడా ఆలోచించండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎలాంటి మగాళ్లతో జీవిస్తున్నామో ఓ సారి ఆలోచించండి. మహిళలు డీఏంకే పార్టీ గురించి కానీ, పార్టీలోని వారి గురించి కానీ, తప్పుగా మాట్లాడితే వారిపై దారుణాలకు ఒడిగడతారు. అలాంటి సంఘటనలు చాలా చూశాం. నేను దేన్నీ మర్చిపోను. ఎంకే స్టాలిన్‌కు చెబుతున్నా.. నా జోలికి రాకండి. నేను తిరిగి కొడితే తట్టుకోలేరు. యూట్యూబ్‌లో డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లు థంబ్‌లు పెడతారు. కానీ, మాట్లాడేవారి బుద్ధి ఏమైంది. వాళ్లు ఓ తల్లికి పుట్టిన వాళ్లే కదా?’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.