గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు క్యాన్సర్ బారిన పడి కన్నుమూయగా.. ట్రీట్ మెంట్ తో జయించిన వారు ఉన్నారు. కొంతమంది నటీమణులు క్యాన్సర్ భారిన పడి ట్రీట్ మెంట్ సమయంలో తాము ఎంత బాధ అనుభవించామో తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నటి హంస నందిని తాజాగా క్యాన్సర్ జయించి మళ్లీ షూటింగ్ లో బిజీగా మారింది.
పూనే లో పుట్టి పెరిగిన హంస నందిని అసలు పేరు పూనం. 2002 లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన హంస నందిని పలు టీవీ యాడ్స్ లో నటించింది. ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘ఒకటవుదాం’చిత్రంలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. వంశి దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘అనుమానాస్పదం’ మూవీతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో ఆమె పేరు హంస నందినిగా మార్చుకుంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో దుమ్మురేపింది. లౌక్యం చిత్రంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.
హంస నందిని 2021లో బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడినట్లు సోషల్ మాద్యమాల ద్వారా వెల్లడించింది. ఇది తన కుటుంబంలో వంశపార్యంపరంగా వస్తున్నదని.. తన తల్లి కూడా క్యాన్సర్ భారిన పడి చనిపోయినట్లుగా తెలిపింది. ఏడాది పాటు కీమోథెరపీ చికిత్సలు చేయించుకుంది. వైద్యుల సమక్షంలో ట్రీట్ మెంట్ తీసుకొని వారు చెప్పిన సలహాలు.. సూచనలు పాటిస్తూ మొత్తానికి ప్రాణాంతకరమైన క్యాన్సర్ ని జయించింది. ఏడాది కాలం పాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన హంస నందిని ప్రస్తుతం ఆరోగ్యంతో ఉండటంతో షూటింగ్స్ పై ఫోకస్ పెట్టింది.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత హంస నందిని ఓ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను మళ్లీ సెట్ లో అడుగు పెట్టా.. ఎంతో సంతోషంగా ఉంది.. నాకు ఆ భగవంతుడు మరోసారి పునర్జన్మ ఇచ్చాడు.. నా సహ నటులతో మళ్లీ కెమెరా ముందు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటా.. ఇలాంటి ఆనంద సమయం ఎలా మిస్ అవుతాను? ప్రేక్షకుల ప్రేమ, ఆప్యాయత, దీవెనలు నన్న మళ్లీ బతికించాయి.. అందరికీ కృతజ్ఞతలు.. ఐ యామ్ బ్యాక్’ అంటూ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. సెట్ లో ఉన్న హంస నందినికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.