తెలుగు చిత్రసీమలో అటు క్లాసికల్ డాన్స్ కైనా, ఇటు వెస్టర్న్ స్టెప్పులకైనా తెరపై వన్నె తెచ్చిన హీరోయిన్లలో భానుప్రియ ఒకరు. అందం, అభినయంతో హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ఇండస్ట్రీని ఏలిన భానుప్రియ.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కెరీర్ లో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన భానుప్రియ.. అందచందాలతోనే కాదు.. తన డాన్స్ తో హీరోలను సైతం డామినేట్ చేసి చూపించింది. చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరు స్టార్స్ సరసన సినిమాలు చేసి విశేషమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. భానుప్రియ సోదరి శాంతిప్రియ కూడా తెలుగు, తమిళ, హిందీ భాషలలో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న విషయం విదితమే.
ఇక స్టార్ హీరోయిన్ గా సుమారు పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీని షేక్ చేసిన భానుప్రియ.. 1998లో ఒక్కసారిగా పెళ్లి వార్త చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసింది. రాజమండ్రిలో పుట్టిపెరిగిన భానుప్రియ.. హీరోయిన్ గా స్వర్ణకమలం, సితార, అన్వేషణ, ఆలాపన లాంటి సినిమాలతో క్లాసికల్ డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మోడరన్.. మాస్ కమర్షియల్.. గ్లామర్ సినిమాలతో శభాష్ అనిపించుకుంది. చేతినిండా సినిమాలతో, వరుస అవకాశాలతో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే భానుప్రియ గ్రాఫిక్ డిజైనర్ ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని పెళ్ళాడి ఫారెన్ వెళ్లిపోయింది. అక్కడినుండి ఆమె జీవితంలో అసలు కష్టాలు మొదలయ్యాయి.
కట్ చేస్తే.. భానుప్రియకు ఓ పాప పుట్టాక మళ్లీ ఇండియాకి తిరిగివచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. పాప పుట్టిన కొద్దిరోజులకే భర్తతో విడిపోయిన భానుప్రియ.. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణించడం కష్టమైపోయింది. మరోవైపు విడిపోయిన కొంతకాలానికి భర్త మరణించడంతో భానుప్రియ లైఫ్ లో విషాదం నెలకొంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ.. వచ్చిన అవకాశాలతో కంటిన్యూ అయిపోయింది. అలా గౌతమ్ ఎస్ఎస్సి, ఛత్రపతి, అవతారం సినిమాలలో క్యారెక్టర్స్ పోషించింది. అయినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కులేని భానుప్రియ.. ఇప్పటికి అద్దె ఇంట్లో జీవనాన్ని సాగిస్తోందని సమాచారం. ఎక్కడి స్టార్డమ్.. ఎక్కడి అద్దె ఇంటి జీవితం.. హీరోయిన్ గా దశాబ్దాలు వెలిగిన భాను.. ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడి పోయిందనే వార్త సినీ ప్రేక్షకులను, ఆమె అభిమానులను కలచివేస్తోంది.