రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా అరుదు. ఒకవేళ అవకాశం వచ్చినా సరే.. వారు అంతగా వెలుగులోకి రారు. ప్రభావవంతంగా రాణించలేరు.. తమదైన ముద్ర వేయలేరు. అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం.. ఇందుకు భిన్నం. సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలానే రాజకీయాల్లో.. ప్రత్యుర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగల నేతల్లో రోజా ముందు వరుసలో ఉంటారు. అయితే సెలబ్రిటీల మీద విమర్శలు రావడం అనేది సహజం. వాళ్లు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి విమర్శలను పట్టించుకోరు. కుటుంబ సభ్యుల మీద విమర్శలు వస్తే.. వెంటనే రియాక్టయ్యి.. కౌంటర్ ఇస్తారు. కొన్ని రోజుల క్రితం రోజా విషయంలో ఇలానే ట్రోలింగ్ జరిగింది. దానిపై ఆమె తాజాగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి రోజాను ముద్దు పెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. దీనిపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. ఇక విమర్శలు చేయాలని గట్టిగా ఫిక్సయిన వారికి.. ఫోటోలోని వ్యక్తి ఎవరు.. రోజాకు ఆ వ్యక్తి ఏమవుతారు అనే విషయాల గురించి ఆరా తీయకుండా.. వెంటనే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అది కూడా చాలా అసహ్యకర రీతిలో. దీనిపై రోజా చాలా బాధపడ్డారు. కారణం ఫోటోలో ఆమెతో పాటు ఉన్న వ్యక్తి.. రోజా సొంత అన్నయ్య. ఆమెకు ముద్దు పెట్టిన వ్యక్తి.. రోజా రెండో అన్నయ్య రామ్ ప్రసాద్. కానీ ట్రోలర్స్‌కు ఇవేం అక్కర్లేదు. దాంతో అసహ్యకరంగా విమర్శలు చేశారు.
తాజాగా ఈ ట్రోలింగ్‌పై రోజా స్పందిస్తూ.. ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ఇప్పటి వరకు నా మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ వేటికీ నేను బాధ పడలేదు. కానీ ఈ ఫోటోపై వచ్చిన విమర్శలు చూసి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఫోటోలో ఉన్న వ్యక్తి నా సోదరుడు. అన్నయ్య అంటే నాకు చాలా ప్రేమ, ప్రాణం. నాకు అమ్మ, నాన్న లేరు.. చనిపోయారు. అన్నలిద్దరే అమ్మా నాన్నలాగా నన్ను చూసుకున్నారు. నా సంతోషమైనా, కష్టమైనా ముగ్గురం కలిసే ఉంటాం. ఎన్ని గొడవలు, కష్టాలు వచ్చినా మేం ఎప్పుడూ విడిపోం. ఇప్పటి వరకు అలాగే ఉన్నాం..ఇక మీదట కూడా అలానే ఉంటాం’’ అని తెలిపారు.
ఇక అన్నలతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘పెద్దన్నయ్య నాతో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఆయన దగ్గర నాకు అంత చనువు ఉండదు. కానీ చిన్నన్న రామ్ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఎక్కువ. చిన్నప్పటి నుంచి అన్న.. నేను ట్యూషన్స్, స్కూల్, కాలేజ్‌లకు ఇలా నేను ఎక్కడికి వెళ్లినా.. తను నా వెంటే వచ్చేవాడు. అలాగే సినిమా షూటింగ్స్‌కు కూడా నాతో పాటు వచ్చేవాడు. ఇక నేను రాజకీయాల్లోకి వచ్చాకా.. అన్నలిద్దరూ నా వెంటే.. ఉండి నన్ను కాపాడుకున్నారు. ఇప్పుడు నేను మినిష్టర్‌గా బిజీగా ఉంటే.. నా అన్నలే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ వచ్చారు’’ అని తెలిపారు.
‘‘నాతో అంత ప్రేమగా ఉండే అన్నయ్యలు నన్ను.. హగ్ చేసుకుని.. ముద్దు పెట్టుకుంటే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ట్రోల్ చేసే వారి మైండ్‌లోకి ఇలాంటి విషపు ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. మాలా.. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి తెలియని వాళ్లే ఇలా విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఈ విషయంలో ట్రోల్ చేసిన వాళ్లు మనుషులు కారు.. ఒక అమ్మ, నాన్నకు పుట్టినవాళ్లు అయ్యుండరు’’ అంటూ రోజా ట్రోలర్స్‌కి ఘాటుగా సమాధానం చెప్పారు