కరోనా కష్టకాలంలో అయిన వారినే దూరంగా పెడుతున్న సమయంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినా నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరో అయ్యాడు. సోనూసూద్ చేపట్టిన మంచి పనులకు సోషల్ మీడియా ఆయనకు నీరాజనాలు పడుతోంది. ఇక కొంతమంది తమ మనసుల్లో ఉప్పొంగుతున్న ప్రేమను చూపెట్టడానికి ఏకంగా సోనూ సూద్ కు దేవాలయాలు కట్టి, దేవుడిగా పూజిస్తున్నారు. కష్టం ఉందని ఆయనకు తెలిస్తే చాలు విషయం గురించి తెలుసుకొని వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఈ మద్యనే ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కి కరోనా తో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకొని ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. తన ఫ్యాన్స్ విషయంలో కూడా సోనూసూద్ సహృదయాన్ని పాటిస్తుంటాడు. తాజాగా ఒక ఆటో వాలా జీవిత కాల ఆశను తీర్చడానికి ఆయన సిటీలో అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వినోద్ అనే ఆటో డ్రైవర్ కి సోనూసూద్ అంటే వల్లమాలిన అభిమానం. ఎలాగైనా సోనూ భాయ్‌ను కలవాలని ముంబై కూడా వెళ్లాడు. కానీ సోనూ సూద్‌ను కలవడం కుదరకపోవడంతో నిరాశగా వెనుదిరిగి, వచ్చేశాడు. అయితే సోనూ సూద్‌ను జీవితంలో ఒక్కసారైనా కలవాలన్నదే జీవితాశయం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఆటోపై రాశాడు వినోద్. ‘‘వన్ లైఫ్.. వన్ చాన్స్.. గివ్ మీ వన్ చాన్స్ టు మీట్ యువ్ సోనూ సూద్ సర్” అంటూ తన ఆటోపై రాశాడతను. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనూసూద్ కి తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన హైదరాబాద్ వచ్చి… అతడి కల నెరవేర్చారు.
ఈ సందర్భంగా వినోద్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. అతడు తన కల నెరవేరిందని, ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పడంతో.. సోనూ సూద్ తన కల కూడా నెరవేరిందని చెప్పారు. దానికి కారణం తనకు ఆటో తోలాలని ఎప్పటి నుంచి ఆశగా ఉందని, ఆ కల ఇవాళ్టితో తీరుతోందని అన్నారు. తనను హైదరాబాద్ తిప్పాలని.. తనకు డిస్కౌంట్ ఇస్తావా అనడంతో.. వినోద్ సార్ మీకు ఫ్రీ అన్నాడు. అవసరం లేదు.. నీకు డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పారు. అంతే కాదు హైదరాబాద్ వస్తే వినోద్ ఆటో ఎక్కి సిటీ మొత్తం చూడండి అంటూ నెటిజన్లకు చెప్పాడు. స్టార్ హోదాలో ఉండి కూడా సామాన్యులతో మమేకమవుతున్న సోనూసూద్ కి హ్యాట్సాఫ్.