సామాన్యుల వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి.. తమకు చేతనైనంతలో ఎంతో కొంత ఆస్తో, డబ్బో సంపాదించి.. వారి పిల్లలకు అందజేస్తారు. సామాన్యులే తమ పిల్లల భవిష్యత్తు గురించి ఇంత ఆలోచిస్తే.. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం ఉంది. తరతరాల వరకు తిన్నా తరగని సంపదను పోగు చేసి.. బిడ్డలకు అందిస్తారు. అయితే అందరి విషయంలో ఇలానే జరుగుతుందా అంటే లేదు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మన కళ్ల ముందే ఎంతటి దీన స్థితిలో.. దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీశారో ప్రత్యక్షంగా చూశాం. వారంతా ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించి.. వైభోగంగా బతికిన వారే. కానీ జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల.. పాతాళానికి పడి పోయారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ హీరో కాంతారావు.. అలియాస్ కత్తి కాంతారావు.
కాంతారావు అంటే ఈ జనరేషన్ వాళ్లకి తెలియకపోవచ్చు గానీ.. పాతికేళ్ల క్రితం వరకు ప్రేక్షకుల దృష్టిలో ఆయనో సూపర్ హీరో. తెలంగాణ నుంచి తొలి హీరో. కాంతారావు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది.. జానపద చిత్రాల్లో ఆయన చేసే కత్తి ఫైటింగ్‌లు. అప్పట్లో వాటికి విపరీతమైన ఆదరణ. దాంతో ఆయన పేరుకు ముందు కత్తి అని చేరింది. ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న రోజుల్లో కూడా కాంతారావు.. హీరోగా రాణించారు. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన.. జీవితం ఆఖరి రోజుల్లో ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించారు. ఆయన కుమారుల ఆర్థిక పరిస్థితి కూడా ఎంత మాత్రం బాగాలేదు. వారికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు.మరి అన్ని వందల చిత్రాల్లో హీరోగా నటించిన వ్యక్తి.. జీవిత చరమాంకంలో ఇన్ని ఆర్థిక కష్టాలు అనుభవించడం వెనక గల కారణాలను ఆయన కుమార్తె సుశీల వెల్లడించారు.
ఈ క్రమంలో సుమన్ టీవీ కాంతారావు కుమార్తెని సుశీలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె సంచలన విషయాలు వెల్లడించింది. కాంతారావు కుమార్తె సుశీల ప్రస్తుతం బాగ్‌లింగంపల్లి క్వార్టర్స్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నాన్నగారికి మేం ఐదుగురు సంతానం. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను కాగా.. మరో నలుగురు మగపిల్లలు. ప్రసుత్తం నేను బాగ్‌లింగంపల్లి క్వార్టర్స్‌లో అద్దెకు ఉంటున్నాం. కానీ చివరి ఇద్దరు తమ్ముళ్లకు సొంత ఇల్లు లేదు. నాన్నగారు పరిశ్రమలోకి వచ్చే సరికి ఆయనకు వారసత్వంగా 400 ఎకరాలు భూమి లభించింది. ఇక మద్రాస్‌లో ఆయన ప్యాలెస్ నిర్మించారు. ఒకప్పుడు ఎంతో లగ్జరీ జీవితాన్ని అనుభవించాం’’ అని తెలిపారు
అయితే సజావుగా సాగుతున్న వారి జీవితంలో సినీ నిర్మాణం తీరని కష్టాలు తెచ్చి పెట్టింది అన్నారు సుశీల. కాంతారావు.. సినిమాలు తీసి.. నష్టపోయి.. ఆస్తులన్నింటిని అమ్ముకున్నారు. దానికితోడు అడిగిన వారికి కాదనకుండా దానధర్మాలు చేయడంతో.. చివరకు వారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఆయన చనిపోయే వరకు కూడా అప్పుల బాధలు వెంటాడాయి. ఇక చివరి దశలో క్యాన్సర్ బారిన పడ్డారు. చివరకు 2009లో మృతి చెందారు. ఇక కాంతారావు చిన్న కుమారులు ఇద్దరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఉండటానికి కనీసం సొంతంగా ఇళ్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఎలాంటి స్పందన లేదన్నారు సుశీల.
ఈ క్రమంలో సుశీల మాట్లాడుతూ.. ‘‘నాన్నగారి శతజయంతి ఉత్సవాల వరకైనా సరే ప్రభుత్వం స్పందించి.. ఆయన పేరు మీద విగ్రహమో.. ఏదైనా స్మారక చిహ్నమో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. అలానే మా తమ్ముల్లను ఆదుకోవాలని కోరుతున్నాం’’ అన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటుడు.. బిడ్డలను ఇలాంటి స్థితిలో చూసి అభిమానులు జాలి పడుతున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.