రోజులు మారాయి. పిదప కాలం మనుషులు, పిదప కాలం బుద్ధులు అన్నట్లు.. నేటి పిల్లలు దారుణంగా తయారయ్యారు. ఇంట్లోనే కాదు.. చదువులు చెప్పే విద్యాలయాల్లోనూ వారి తీరు మారటం లేదు. తమకు ఇబ్బంది కలిగితే ఎంతకైనా తెగిస్తున్నారు. చంపటానికైనా వెనకాడటం లేదు. తాజాగా, ఓ 6 ఏళ్ల పిల్లాడు మహిళా టీచర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. తనతో గొడవపెట్టుకోవటంతో తుపాకితో కాల్చాడు. అది కూడా తరగతి గదిలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన అమెరికాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అమెరికా, వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఓ ఆరేళ్ల పిల్లాడు అక్కడి ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడికి మహిళా టీచర్‌తో క్లాస్ రూమ్‌లో గొడవైంది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ పిల్లాడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పట్టలేని కోపంతో బ్యాగ్‌లోని హ్యాండ్ గన్‌ను బయటకు తీశాడు. టీచర్‌కు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్కూల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, అమెరికాలో గన్ కల్చర్ పెచ్చుమీరి విలయ తాండవం చేస్తూ ఉంది. ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట కాల్పుల మోత మోగుతోంది. ప్రతీ ఏటా వేల సంఖ్యలో జనం కన్నుమూస్తూ ఉన్నారు. మరి, క్లాస్ రూమ్‌లో మహిళా టీచర్ పై ఆరేళ్ల పిల్లాడు కాల్పులకు తెగబడిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.