జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను పొంది, అరణ్యవాసంలో ఆహారానికి లోటు లేకుండా చేసుకోగలిగాడు. సత్రాజిత్తు సూర్యోపాసనతో శ్యమంతకమణి పొందాడు. సూర్యమంత్రం ప్రభావం వల్లనే కుంతీదేవికి కర్ణుడు జన్మించాడు.
ఇతిహాసాల్లో, పురాణాలలో సూర్యుడి మహాత్మ్యాన్ని వెల్లడించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆదిదేవుడైన సూర్యభగవానుణ్ణి నిష్టగా అర్చిస్తే, సర్వాభీష్టాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. మాఘ బహుళ సప్తమి సూర్య జయంతి. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. అందుకే ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అనే లోకోక్తి పుట్టింది.