చాలా మందికి ప్రభుత్వ ఉద్యగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ఏపీలోని నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీ హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించింది. ఈక్రమంలో ఏర్పడిన ఖాళీలను, అప్పటికే ఉన్న ఖాళీలను మొత్తం కలిపి 3,673 పోస్టులను భర్తీచేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ విషయంకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హైకోర్టుతో పాటు జిల్లా కోర్టుల్లో ఉన్న ఖాళీను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులోని వివిధ కేటగిరిల్లో ఉన్న 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు జిల్లా కోర్టుల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత కుమార్ ఇప్పటికే తెప్పించుకున్నారు. తాజాగా ఆ ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాన న్యామూర్తి ఆదేశాలు ఇచ్చారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 3,432 పోస్టులకు భర్తీకి హైకోర్టు అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇక ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను హైకోర్టు వెబ్‌సైట్ https://hc.ap.nic.in/ లో పొందుపరిచారు. ఇక అర్హులైన అభ్యుర్ధులు ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హైకోర్టుకు సంబంధించిన పోస్టుల దరఖాస్తులను హైకోర్టు వెబ్ సైట్ లో, జిల్లా కోర్టుల్లో పోస్టుల దరఖాస్తులను కూడా ఆయా జిల్లాల ఈ–కోర్ట్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు.
హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తులు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 15వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అదే విధంగా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఖాళీల వివరాల విషయానికి వస్తే..
ఇక పోస్టులను బట్టి ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్మతతో పాటు టైప్ రైటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కొన్ని పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. జూలై 1, 2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్ధులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఇక వేతనాల విషయానికి వస్తే పోస్టులను బట్టీ రూ.20 వేల నుంచి లక్ష మధ్య ఉంటుంది.
ఈ పోస్టులకు జనరల్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు రూ.800, అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400గా ఉంది. పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే.. ఏపీ హైకోర్టు ప్రకటనలు వేరు వేరుగా జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్ ప్రకారం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.