ప్రభుత్వ కొలువును సాధించేందుకు ఎంతో మంది యువకులు రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడెప్పుడు జాబ్ నోటిఫికేషన్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు శాఖలోని వివిధ పోస్టులకు సంబంధించి నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాలకు సంబంధించి మొత్తంగా 6,511 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఏపీలోని నిరుద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీస్ శాఖలోని 6,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎస్సై 411, సివిన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3,580, ఏపీఎస్పీలో 2,520 కాని స్టేబులు పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు ప్రక్రియ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. అప్లయ్ చేసేందుకు చివరది తేదీ జనవరి 18గా నిర్ణయించారు. అలానే కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 28 తేదీతో ముగుస్తుంది. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం 1 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్ధులు https://slprb.ap.gov.in వెబ్ సైట్ ను చూడండి.