వరల్డ్ క్రికెట్ లో IPL మేనియా స్టార్ట్ అయ్యింది. మినీ వేలంతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీ. తాజాగా శుక్రవారం జరిగిన 2023 ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. మరీ ముఖ్యంగా ఆల్ రౌండర్లపైనే అన్ని ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టాయి. దాంతో వారిపై కాసుల వర్షం కురిసింది. ఇక ఈ వేలం ముంబై ఇండియన్స్ కు ప్రతిష్టాత్మకంగా మారింది దానికి కారణం.. ఆ జట్టు టీ20ల్లో భీకర బ్యాటర్ అయిన పొలార్డ్ ను కోల్పోయింది. ఈ వేలనికి కొన్ని రోజుల ముందే క్రికెట్ వీడ్కోలు పలికాడు ఈ కరేబియన్ స్టార్. దాంతో అతడి స్థానాన్ని భర్తీ చేయడం ముంబైకు సవాల్ గా మారింది. దానికి తగ్గట్లుగానే ముంబై ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ అయిన కామెరూన్ గ్రీన్ ను రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్.. IPL చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ కైవసం చేసుకున్న జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ఐదు టైటిల్స్ సాధించి.. ఆరో టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది ముంబై జట్టు. అయితే వేలానికి ముందే ఈ టీమ్ స్టార్ ప్లేయర్స్ ను అంటిపెట్టుకుని ఉంది. వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్ట్ బ్రెవిస్ యువ ఆటగాళ్లను కూడా అంటిపెట్టుకుంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే.. ముంబై జట్టు ఒకప్పటి ఛాంపియన్ జట్టును తలపిస్తుందనే చెప్పాలి. జట్టులో అందరు టీ20 హిట్టర్లు ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ లో రోహిత్, సూర్య, కిషన్, స్టబ్స్, బ్రెవిస్, టిమ్ డెవిడ్ లతో భీకరంగా ఉంది. అటు బౌలింగ్ లో సైతం.. బూమ్రా, జోఫ్రా ఆర్చర్, బెహ్రండాఫ్, రిచర్డ్ సన్, చావ్లా, కామెరూన్ గ్రీన్ లతో శత్రు దుర్భేద్యంగా ఉంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్ కు ఈ సారైనా అవకాశం వస్తుందో.. లేదో చూడాలి మరి.
అద్భుతమైన బ్యాటర్లతో నిండిన ముంబై ఇండియన్స్ లో ఇటీవలే బంగ్లా తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాది.. భీకర ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే యువ సంచలనం టిమ్ డేవిడ్ ఓపెనర్ గా బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మూడో బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మిడిలార్డర్ లో తిలక్ వర్మ, డెవాల్ట్ బ్రెవిస్, కామెరూన్ గ్రీన్ లు బ్యాటింగ్ కు దిగనున్నారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి వస్తే.. అత్యంత పటిష్టవంతంగా ఉంది. డెత్ బౌలింగ్ స్పెషలిస్టు బూమ్రాతో పాటుగా ఇంగ్లాండ్ సంచలనం జోఫ్రా ఆర్చర్ బాల్ ను పంచుకోనున్నాడు. మరో ఎండ్ లో కామెరూన్ గ్రీన్, కుమార్ కార్తికేయ, చావ్లాలు ఎటాక్ చేయనున్నారు.
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, కామెరున్ గ్రీన్, డెవాల్డ్ బ్రెవిస్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తీకేయ, పీయూష్ చావ్లా.
వీరితో పాటుగా ముంబై జట్టులో ఈ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో.. రమణ్ దీప్ సింగ్, అర్జున్ టెండుల్కర్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, జేసన్ బెహ్రెండాఫ్, ఆకాష్ మధువాల్, రిచర్డ్ సన్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములాని, నేహల్ వాధేరా, రాఘవ్ గోయల్
The five-time IPL champions, Mumbai Indians’ starting XI looks scary ☠️🏆🏆🏆🏆🏆#IPL2023Auction pic.twitter.com/qlobI2ouqI
— CricTracker (@Cricketracker) December 24, 2022