పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లు.. పచ్చగా కలకళ్లాడతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే.. పనులు ప్రాంరభమవుతాయి. ఇలు దులిపి.. శుభ్రం చేసుకుంటారు. పండుగ షాపింగ్ ప్రారంభిస్తారు. ఇక పండగ అంటే.. పిండివంటలు తప్పనిసరి. ఎంత పేదవారైనా సరే పండుగ పూట.. ఏదో ఒక పిండివంట తయారు చేసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం రెండు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. ఏ ఇంట చూసినా సరే.. పిండివంటల వాసనతో గుమగుమలాడిపోతాయి. ఇక సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఇక సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో అరిసెలు ఎక్కువగా చేస్తారు. అదే తెలంగాణ విషయానికి వస్తే.. సకినాలు చేసేవాళ్లు ఎక్కువ. తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో.. తయారు చేయడం అంత కష్టం. మరీ ముఖ్యంగా అరిసెలు తయారు చేయడం అందరికి రాదు. పాకం ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక అవి పనికిరావు.
అందుకే చాలా మంది రిస్క్ ఎందుకని.. హాట్ అంటే కారప్పూస, బుందీ, మురుకులు వంటి వాటిని తయారు చేసుకుంటారు. అయితే పండుగ పూట పిండి వంటలు తయారు చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే మోసపోయే అవకాశం ఉంది అంటున్నారు. అదెలా అంటే.. పండుగ పూట పిండి వంటలు తప్పనిసరి. వాటి తయారీ కోసం జనాలు పెద్ద ఎత్తున నూనె, బెల్లం, నెయ్యి వంటివి కొనుగోలు చేస్తారు. పండుగ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కల్తీ రాయుళ్లు.. రంగంలోకి దిగుతారు. నూనె, నెయ్యిని కల్తీ చేసి ప్రజలకు అంటగడతారు.
నూనె విషయంలో కల్తీ జరిగే అవకాశం ఎక్కువ. పత్తి గింజలు, పశువుల ఎముకలు వంటి వాటి నుంచి నూనె తయారు చేసి.. వాటిని ప్రముఖ బ్రాండ్స్ ప్యాకింగ్ కవర్ల మాదిరి కనిపించే సాచెట్స్, డబ్బాల్లో ప్యాక్ చేసి కస్టమర్లకు అంటగడుతుంటారు. ఇక నెయ్యి విషయంలో డాల్డా కలిపి మోసం చేస్తారు. బెల్లం కూడా కల్తీ చేస్తారు. కనుక పండుగ పూట పిండి వంటలు చేయాలని భావించే వారు.. హడావుడి పడకుండా.. ఆయా పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా.. ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని.. కొనుగోలు చేయాలి. ధర తక్కువ అని.. ఏదైతే ఏంటి అని ఏదో ఒకటి కొంటే.. ఆ తర్వాత ఇంటిల్లిపాది అనారోగ్యం బారినపడతారు. కనుక నాణ్యమైన పదార్థాలు తెచ్చుకుని.. పిండి వంటలు చేసుకుని.. కుటుంబ సభ్యులంతా సంతోషంగా పండుగ జరుపుకోండి.