గుండెపోటు.. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న సమస్య. ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల పైబడిన వారు అనే తేడా లేకుండా గుండె పోటు బాధితులు పెరుగుతున్నారు. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు.. గుండెపోటు కారణంగా ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడి సలహా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఆ వివరాలు..
గుండెపోటు అనే మాట వింటేనే చాలు.. జనాలు ఒక్కసారిగి ఉలిక్కిపడుతున్నారు. భయంతో వణికిపోతున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు కూడా గుండెపోటు అంటే.. కేవలం 50 ఏళ్లు దాటిన వారు, స్థూలకాయం, బీపీ, షుగర్ అధికంగా ఉన్న వారికి వచ్చే జబ్బు అన్నట్లుగా ఉండేది. వారిలో కూడా చాలా మంది మైల్డ్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి.. వైద్యుల సూచన మేరకు సలహాలు పాటిస్తే.. పదిలంగానే ఉండేవారు. మరి నేటి కాలంలో సంభవిస్తోన్న గుండె పోటు మరణాలు చూస్తే.. భయమేస్తోంది. చావు ఎప్పుడు, ఎవరిని, ఎలా పలకరిస్తుందో చెప్పలేం అంటారు. ప్రసుత్తం ఈ మాటలు గుండెపోటుకు వర్తిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. గుండెపోటు బాధితులంతా.. వెను వెంటనే కుప్ప కూలుతున్నారు. అంత సేపు మన మధ్యే ఉండి.. సంతోషంగా గడిపిన వారు.. ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా కన్ను మూస్తున్నారు. ఈ కేసుల్లో కార్డియాక్ అరెస్ట్‌కు గురైనవారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతుండటంతో.. చాలా మంది కరోనా వ్యాక్సిన్ కారణంగానే హార్ట్ ఎటాక్ వస్తుందని భయపడుతున్నారు. మరొ కొందరేమో.. కరోనా సమయంలో వాడిన స్టెరాయిడ్ల వల్ల ఈ సమస్య పెరుగుతుంది అంటున్నారు. అయితే అభిప్రాయాలు ఏవైనా సరే.. ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్‌లు పెరుగుతున్న మాట వాస్తవం. వీటిని గుర్తించే వీలు కూడా ఉండటం లేదు. కన్నుమూసి తెరిచే లోపు.. ఎటాక్ ఉప్పెనలా వచ్చి.. ఊపిరి తీస్తోంది. ఈ నేపథ్యంలో గుండె ఎందుకు ఇంత సడెన్‌గా మొరాయిస్తోంది.. దీన్ని ముందే పసిగట్టలేమా.. అడ్డుకోలేమా అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కార్డియోథొరాసిక్ సర్జన్ సి.ప్రభాకరరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ప్రభాకర్ రెడ్డి ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆయన తన మిత్రుడికి ఇచ్చిన ఓ సలహా.. అతడి ప్రాణాలు కాపాడింది అని తెలిపాడు. ఆ వివరాలు..
ప్రభాకర్ చేసిన పోస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘వారం రోజుల క్రితం నా మిత్రుడొకరు మెసేజ్ చేశాడు. నీకు గుండెజబ్బులపై మంచి అవగాహ ఉంది కదా. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.. వాటికి ఆన్సర్ చెప్పు అని మెసేజ్ చేశాడు. దానిలో నా ఫ్రెండ్.. తనకు 58 సంవత్సరాలు అని, షుగర్, బీపీ సమస్యలు లేవు, రోజు వాకింగ్, ధ్యానం తప్పకుండా చేస్తాను. ఇక మద్యం, ధూమపానం అలవాట్లు కూడా లేవు. కానీ మా వంశంలో గుండె జబ్బు మరణాలున్నాయి. అందుకే కొన్ని రోజుల క్రితం ఈసీజీ, ఎకో టెస్ట్‌లు చేయించాను. నార్మల్‌గానే ఉన్నాయి. అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేయిస్తాను. అవి కూడా నార్మల్ అనే వచ్చాయి. కాకపోతే బ్లడ్ టెస్ట్‌లో నా హోమోసిస్టిన్ విలువలు ఎక్కువగా ఉన్నట్లు వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి’’ అని అడిగాడు.
అప్పుడు నేను ‘‘నీకు హోమోసిస్టిన్ విలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సీటీస్కాన్ కరోనరి ఆంజియోగ్రామ్ చేయించాలి అన్నాను. దానికి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది అని తెలిపాను. అప్పుడ నా మిత్రుడు ఆ టెస్ట్ ఎందుకు అన్నాడు. అప్పుడు నేను చాలా దేశాలలో దానిని స్క్రీనింగు టెస్ట్‌గా వాడతారు. 50 ఏళ్ళు దాటిన వారు ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. పైగా నీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి చేయించుకో అన్నాను. అయితే నా మిత్రుడు మెడికల్ మాఫియా అనుకుంటాడేమో అని భయపడి.. కాస్త నిదానంగా అయినా పర్లేదు.. కానీ చేయించుకో బెటర్ అన్నాను’’ అని రాసుకొచ్చాడు.
‘‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. నా ఫ్రెండ్ నేను చెప్పిన మరుసటి రోజే.. ఆ టెస్ట్ చేయించుకున్నాడు. ఆశ్చర్యం అతడి టెస్ట్ రిపోర్ట్ నార్మల్‌గా లేదు. ముఖ్యమైన ఎల్‌ఏడీ నాళంలో 80-90 శాతం బ్లాక్ ఉంది.. మిగతా రెండింటిలో 40-50 శాతం బ్లాక్‌లు ఉన్నాయి. అతడి టెస్ట్ రిపోర్ట్స్ చూసిన నేను వెంటనే ఆంజియోగ్రామ్ చేయించుకుని.. స్టంట్ వేయించుకో అన్నాను. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న సడెన్, సైలెంట్ హార్ట్ ఎటాక్‌లకు ఇవే కారణం. కోవిడ్, కరోనా టీకా కాదు. స్క్రీనింగ్ చాలా ముఖ్యం. సైలెంట్ కిల్లర్ అంటే ఇదే’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘నిత్యం మనం ఎన్నో ఖర్చులు చేస్తాం. మరి హెల్త్ కోసం కూడా అవసరం అనిపిస్తే.. కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ సాధారణంగా.. హార్ట్ అటాక్ వచ్చినపుడే కనుక్కోగలదు. అలానే ఎకో, ట్రెడ్మిల్ అనే వాటి వల్ల కొంత పసిగట్టచ్చు. కానీ పూర్తిగా, వాస్తవంగా తెలుసుకోవాలంట సీటీ స్కాన్ ఆంజియో ఉత్తమమైనది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.