ఉగాది పేరు చెప్పగానే అందరికీ పచ్చడి మాత్రమే గుర్తొస్తుంది. ఆరు రుచులతో చేసి ఈ పదార్థాన్ని దాదాపు ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. దీని విశిష్టత, ఎందుకు తీసుకోవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా?
ఉగాది.. తెలుగువారికి కొత్త సంవత్సరం. ఆ రోజు ఏం చేసినా చేయకపోయినా సరే షడ్రుచులతో తయారుచేసిన పచ్చడి మాత్రం కచ్చితంగా తింటారు. మిగతా పండగల్లో పిండి వంటలు హైలెట్ అవుతాయి. ఉగాది రోజు మాత్రం పచ్చడి ప్రత్యేకంగా నిలుస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పచ్చడికి చాలా స్పెషాలిటీ ఉంది. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో చేసిన పచ్చడి వెనక సంప్రదాయంతోపాటు అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వసంత ఋతువులోకి మనం ప్రవేశిస్తాం కాబట్టి శారీరకంగా, మాససికంగా వచ్చే మార్పుల్ని తట్టుకుని నిలబడటానికి ఈ పచ్చడి చాలా ఉపయోగపడుతుందనేది నిపుణుల మాట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఉగాది నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సత్ఫలితాన్ని అనుభవించే సమయమని అర్థం. భోగభాగ్యాలు ఇచ్చేది కాబట్టి దీనికి శోభకృత్ నామ సంవత్సరం అని పిలుస్తారు. కొత్త ఏడాది సందర్భంగా ఉగాది పచ్చడి విశేషాలు చెప్పిన ప్రముఖ నిపుణులు స్వప్న హైందవి.. ఈ పచ్చడి వల్ల ఎన్నెన్ని లాభాలున్నాయో చెప్పుకొచ్చారు. ఒకవేళ గుడికి వెళ్లలేకపోతే ఇంట్లోనే స్వామి వారికి పూజ చేసి పెద్దలకు నమస్కరించి పచ్చడి కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకు రాలి కొత్త చిగురు వస్తుంది కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ఉగాది పచ్చడి తీసుకోవడం మంచిదని, మనకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయని పేర్కొన్నారు. ఉదయాన్నే ఈ పచ్చడి తీసుకోవడం వల్ల.. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ధన్యత చెందుతామని చెప్పుకొచ్చారు.
వసంత ఋతువు మొట్టమొదటి రోజు కాబట్టి.. ఉగాదినాడు ఈ పదార్థాలని కలిపి తీసుకోవడం మంచిదని స్వప్న హైందవి చెప్పారు. మొదటిరోజు ఉన్నట్లు తర్వాత రోజు ఈ ఆరు పదార్థాలు ఉండవు కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. మరి మీలో ఎంతమంది ఉగాది పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారు. కింద కామెంట్ చేయండి.