నాలుగో శ్రావణ శుక్రవారం. పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది. “వరలక్ష్మీ వ్రతం”. ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఉపవాసం మొదలు పూజలు వరకు భక్తి శ్రద్ధలతో మహిళలు చేసి తమ ఇష్టదైవాన్ని కొలుస్తారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్ష లో పాల్గొని స్వామి వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుండి ఆవిర్భవించినట్లు చెబుతూ ఉంటారు.
అమ్మ వారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు అని అంటారు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్దఎత్తున పూజలు చేస్తారు. శ్రావణమాసంలో ప్రత్యేకంగా పూజలు చేసి నోములు చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం.శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
ఈ నెల గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. శ్రావణ మాసంలోని ఈ ఆఖరి శుక్రవారం రోజున అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.