శివరాత్రి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ఉపవాసం, జాగారం. శివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండి.. రాత్రంతా జాగారం చేస్తే పుణ్యం లభిస్తుంది అంటారు. అయితే జాగారం చేసే సమయంలో ఫోన్‌లో టైమ్ పాస్ చేయకుండా.. ఆధ్యాత్మిక చిత్రాలు చూస్తూ శివ నామ స్మరణ చేస్తూ జాగారం పూర్తి చేయండి. ఆ చిత్రాల జాబితా ఇదే..
హిందువులు పరమ పవిత్రంగా భావించే పర్వదినాల్లో శివరాత్రి ఒకటి. పురాణాలు, వేదాల ప్రకారం శివుడు ఈ రోజునే లింగం రూంపంలో ఆవిర్భవించాడని.. ఇదే రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగింది అని చెబుతున్నాయి. ఇక శివరాత్రి పర్వదినం నాడు ప్రజలు భక్తి శ్రద్ధలతో శివయ్యను ఆరాధిస్తారు. చాలా శివాలయాల్లో పెద్ద ఎత్తున అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి.. జాగారం చేసి.. నిష్టగా పూజలు చేస్తారు. ఇక మిగతా పండగలతో పోలిస్తే శివరాత్రి ప్రత్యేకత ఏంటంటే.. జాగారం. రాత్రంతా నిద్ర పోకుండా మెలకువగా ఉండటమే కాక.. శివ నామ స్మరణ చేయాలి.
అయితే వెనకటి కాలంలో శివరాత్రి రోజున రాత్రంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. హరికథలు, నాటకాలు, భజనలు వంటివి ఏర్పాటు చేసి.. భక్తులను జాగురుకం చేసేవారు. అయితే నేటి కాలంలో ఇవన్ని చేయడం కష్టం. ప్రస్తుతం గ్రామాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కనిపించడం లేదు. మరి శివరాత్రి జాగారం చేయాలంటే ఎలా.. సెల్‌లో టైమ్ పాస్ చేస్తే పోలా అనుకుంటున్నారు. అలా చేస్తే.. మహాపాపం. మరి ఎలా అంటే.. శివరాత్రి నాడు.. శివుడి గొప్పతాన్ని వివరిస్తూ.. తెరకెక్కిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూస్తూ.. శివ నామ స్మరణ చేస్తూ.. జాగారం పూర్తి చేయండి. ఇక ఆ సినిమాలు ఏవంటే..
కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వరుని కథతో తెరకెక్కిన చిత్రం శ్రీమంజునాథ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, అర్జున్, సౌందర్య, అంబరీష్, సుమలత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2001లో తెలుగు, కన్నడ భాషాల్లో విడుదలయ్యింది. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా అలరించిన మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో పూర్తి నిడివి కలిగిన శివుడి పాత్రలో నటించి మెప్పించాడు. శివతాండవంతో ప్రేక్షకులను అలరించాడు. సినిమాలోని మహప్రాణ దీపం పాట ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది.
నిష్కల్మషమైన భక్తికి నిలువెత్తు రూపంలా నిలిచిన వ్యక్తి కన్నప్ప. అసామాన్యమైన భక్తితో శివ సాక్షాత్కారం పొందాడు. కన్నప్ప అసలు పేరు తిన్నడు. శ్రీకాళహస్తి వాసి. బోయవాడు. వేట జీవనాధారం. ఇలా ఉండగా ఓ సారి అడవిలో శివలింగం కనిపిస్తుంది. తాను వేటాడి తెచ్చే మాంసాన్నే నైవేద్యంగా పెట్టేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివుడిని అభిషేకించేవాడు. ఓ సారి తిన్నడి భక్తిని పరీక్షించాలనుకున్నాడు శివుడు. దానిలో భాగంగా లింగం ఒక నుంచి రక్తం కారేలా చేశాడు. అది చూసి తిన్నడు విలవిల్లాడాడు. వెంటనే తన కన్ను తీసి లింగానికి పెట్టాడు. రక్తం కారడం ఆగిపోయింది. తర్వాత కుడి కంటి నుంచి రక్తం కారసాగింది. వెంటనే కుడి కన్ను తీసేందుకు యత్నిస్తుండగా శివుడు ప్రత్యక్షమై వారించాడు. కన్నప్పా అని పిలవడంతో తిన్నడు కాస్త కన్నప్ప అయ్యాడు.
ఈ కథను ఆధారంగా చేసుకుని బాపు దర్శకత్వంలో, కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన భక్త కన్నప్ప సినిమా 1976లో విడుదలయ్యింది. కన్నప్పగా ఈ సినిమాలో కృష్ణం రాజు చూసిన నటన అద్భుతం. ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలు రాయిగా నిలిచిపోయింది.
ఆహ్వానం లేనిదే ఆడపిల్ల.. పుట్టింటికి కూడా వెళ్లకూడదనేది ఈ కథ ద్వారా అర్థం అవుతుంది. దక్షుడు బ్రహ్మపుత్రుడు. ఆదిశక్తిని కుమార్తెగా పొందాడు. ఆమె సతీదేవి. శంకరుడి మీద అభిమానం పెంచుకుంది. అతడినే వివాహం ఆడాలని నిర్ణయించుకుంటుంది. కానీ దక్షుడికి ఈశ్వరుడంటే నచ్చదు. అయినా సరే సతీ దేవి శివుడిని వివాహం ఆడుతుంది. ఈ క్రమంలో దక్షుడు నిరీశ్వర యాగం తలపెడతాడు. కుమార్తెను మాత్రం ఆహ్వానించడు. కానీ సతీదేవి పుట్టింటి మీద మమకారంతో ఆహ్వానం లేకపోయినా వెళ్తుంది. అక్కడ అవమానాలు ఎదురుకావడంతో ప్రాణాలు తీసుకుంటుంది. విషయం తెలిసి శివుడు శివతాండవం చేసి వీరభద్రుడిని సృష్టిస్తాడు. అతడు యాగం ధ్వంసం చేసి.. దక్షుడిని హతమారుస్తాడు.
ఈ కథ ప్రధానంశంగా 1962లో దక్షయజ్ఞం సినిమా తెరకెక్కింది. కడారు నాగభూషణం దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, దేవిక ప్రాధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. శివుడి పాత్రలో ఎన్టీఆర్.. దక్షుడి పాత్రలో ఎస్వీఆర్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది.
శివరాత్రి నాడు జాగారం చేసే వారు ఈ ఆధ్యాత్మిక చిత్రాలు చూస్తూ.. శివనామ స్మరణలో తరించండి.