పురాణాలు, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం.. మన దేశంలో సూర్య, చంద్ర గ్రహణాలను చెడుగానే భావిస్తారు. అందులోనూ ఈ రెండు గ్రహణాలు నెల రోజుల వ్యవధిలో ఏర్పడితే.. ఫలితాలు కాస్త తీవ్రంగా ఉంటాయనే అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. దీపావళి పండుగ రోజే సూర్యగ్రహణం ఏర్పడితే.. ఇప్పుడు నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఉండనుంది. ఇక చంద్రగ్రహణం కూడా కార్తీక పౌర్ణమి రోజునే ఏర్పడుతుంది. దీంతో ఆధ్యాత్మిక వేత్తలు సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల లోపు దీపాలను వెలిగించుకోవాలని చెప్పారు.
చంద్రగ్రహణం ఏర్పడేది మంగళవారం సాయంత్రం అయినా.. గ్రహణ వేదన అనేది నవంబర్ 8న ఉదయం 9.15 నుంచే ప్రారంభమవుతుంది. దీన్నే సూతకాలం అంటారు. సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది. గ‍్రహణాలను చెడుగా భావిస్తారు కనుక.. గ్రహణ సమయంలో, సూతకాలంలో కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటారు.