ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభం కాగానే తెలుగువారిని పలకరించే మొదటి పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను తెలుగువారు.. ఎంతో ప్రత్యేక, భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజున కనుమ జరుపుకుంటారు. మూడు రోజుల పాటు.. ఇంటినిండా బంధువులతో.. ఇళ్ల ముందు ముత్యాల రంగ వల్లులతో.. ప్రతి లోగిలి కలకల్లాడుతూ ఉంటుంది. ఇక భారతీయ సంప్రదాయంలో.. పశుపక్ష్యాదులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాటిని కూడా కుటుంబ సభ్యుల్లారు భావిస్తారు. పంట చేతికి వచ్చి.. రైతన్న ఇంటి ధాన్యలక్ష్మి కొలువుండే సంక్రాంతి పండుగ సందర్బంగా.. పశువులను ప్రత్యేకంగా పూజిస్తారు. కనుమను పశువుల పండగ అంటారు.
అయితే పశువులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఉంది. సంక్రాతి పండుగకు.. పంట ఇంటికొస్తుందని చెప్పుకున్నాం కదా. మరి ధాన్యలక్ష్మిని మన ఇంటికి చేర్చడంలో పశువులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పంట పండించే సమయంలో.. పశువులు.. రైతన్నకు ఎంతో సాయం చేస్తాయి. దుక్కి దున్నడం మొదలు.. పంట చేతికి వచ్చే వరకు.. రైతన్నకు చేదోడువాదోడుగా ఉంటాయి పశువులు. మరి అన్నదాతకు ఇంత మేలు చేసే.. పశువులను ప్రత్యేకంగా పూజించుకోవడంలో తప్పులేదు కదా. అందుకనే కనుమ పండుగ రోజు వాటిని ప్రత్యేకంగా పూజిస్తారు.
ఇక కనుమ పండుగ రోజు.. పశువులకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఉప్పు చెక్కను వాటిచేత తినిపిస్తారు. దీన్ని అనేక మూలికలతో తాయారు చేస్తారు కాబట్టి.. ఇది పశువుల్లో సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది. ఇక కనుమ నాడు.. పశువులను శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత.. వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఏకంగా ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. పశువులన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. వాటికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తారు. ఇక వ్యవసాయ వృత్తిలో అన్నదాతలకు సహాయపడుతున్నందుకు.. ఆ కృతజ్ఞతాభావంతో ప్రేమ పూర్వకంగా వాటిని గౌరవించి పుజిస్తారు.