అప్సర ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఓ నీటి కుంటలో పడేసి పరారయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
వికారాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అంతేకాకుండా ఆ యువతి కళ్లను స్క్రూ డ్రైవర్ తో పొడిచి పైశాచికంగా వ్యవహరించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఓ నీటి కుంటలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకి ఈ యువతి ఎవరు? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్. ఇదే గ్రామానికి చెందిన శిరీష (19) వికారాబాద్ లోని ఓ కాలేజీలో నర్సింగ్ చదువుతుంది. అయితే, శనివారం రాత్రి 10 గంటల సమయంలో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చాలా సేపు గడిచిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో వెతికారు. కానీ, శిరీష జాడ మాత్రం దొరకలేదు. ఇక ఆదివారం ఆ యువతి రక్తపు మరకలు అంటిన దుస్తువులు ఓ నీటి కుంట పక్కనే కనిపించాయి. వీటిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సాయంతో ఆ కుంటలో గాలించగా ఆ యువతి మృతదేహం బయటపడింది. ఆ డెడ్ బాడీని బయటకు తీసి పోలీసులు పరిశీలించారు. ఆ అమ్మాయి ఒంటిపై కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా స్క్రూ డ్రైవర్ తో ఆ యువతి కళ్లలో దారుణంగా పొడిచారని కూడా తెలిపారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.