టోల్ గేటు ఆలస్యంగా తీశాడని అక్కడి సిబ్బందిలో ఒకర్ని కొట్టి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
ఈ మధ్య మనుషుల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు చిన్న చిన్న వాటికే అసహనానికి గురవ్వడం, సీరియస్ అవ్వడం లాంటివి చూస్తూనే ఉండి ఉంటారు. చిన్న మాటలకే కోపానికి గురవ్వడం, ఆగ్రహంలో ఎదుటి వ్యక్తిపై దాడికి దిగిన ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అనేది చూడకుండా కోపంలో దాడికి దిగడం.. ఒక్కోసారి ఎదుటి వ్యక్తిని చంపేంత వరకు వెళ్లిపోతున్న ఘటనలు అధికం అవుతున్నాయి. ఇలాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. గేటు తీయడం ఆలస్యమైందని ఒక టోల్ ఉద్యోగి (26)పై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
బెంగళూరు నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగరకు దగ్గర్లోని బిడది పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బిడది టోల్‌ప్లాజాలో ఆదివారం రాత్రి పవన్ కుమార్ (26)తో పాటు అతడి సహచరుడు పని చేస్తున్నారు. ఆ టైమ్‌లో నలుగురు వ్యక్తులు కారులో మైసూరుకు ప్రయాణం చేస్తున్నారు. అయితే వాళ్లు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత.. గేటును త్వరగా తీయాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త గొడవకు దారితీసింది. పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. కానీ ఆ నలుగురు తమ కారును కొంతదూరం పోనిచ్చి ఆగారు. టోల్‌లో పనిచేస్తున్న పవన్, అతడి సహచరుడు బయటకు రాగానే.. వారిపై హాకీ కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో పవన్ మృతి చెందగా.. అతడి సహచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.