పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటూ ప్రమాణం చేశాడు. తల్లిదండ్రులు లేని లోటు మేం తీరుస్తామంటూ ఆ అత్తమామలు మాటిచ్చారు. కానీ, అవన్నీ కల్లలు అని తేలడానికి పెద్ద సమయం పట్టలేదు. అప్పగింతలయ్యి.. అత్తారింటికి వచ్చిన క్షణం నుంచి ఆమెకు నరకం చూపించారు. అదనపు కట్నం, అనుమానం కారణం ఏదైనా రిజల్ట్ మాత్రం ఆమె కళ్లు చెమ్మగిల్లడమే. కన్న తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా భయపడాల్సిందే. భర్త పర్మిషన్ ఇస్తేనే అమ్మతో మాట్లాడాలి. చెల్లి పెళ్లికి కూడా పంపకుండా అడ్డుకున్నారు. ఇచ్చిన కట్నం చాలదంటూ అదనపు కట్నంకోసం వేధింపులకు గురి చేశారు. చివరికి హార్పిక్ తాగించి ఐసీయూలో చేర్పించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన రవీనాకు ఉమ్మడి కిషోర్ కుమార్ తో వివాహం జరిగింది. అక్టోబర్ 24న అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకు అన్నీ కష్టాలే అంటూ చెప్పుకొచ్చింది. భర్త తనకు పెళ్లైన రెండ్రోజుల నుంచే టార్చర్ చూపిస్తున్నాడంటూ ఆరోపించింది. అత్తమామలు పోతన, సత్యవతి కూడా తనను వేధింపులకు గురి చేశారంటూ వాపోయింది. తన తల్లిదండ్రులతో కూడా కలవనివ్వలేదని.. కసిన్ పెళ్లికి కూడా వెళ్లనివ్వకుండా తనని బంధువుల్లో బ్యాడ్ చేశారంటూ చెప్పుకొచ్చింది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తోంది. విశాఖ నాలుగో పట్టణ పీఎస్ ఎదురుగా బైఠాయించి నిరసనకు దిగింది. రూ.34 లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేస్తే ఇంకా రూ.10 లక్షలు కావాలంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని.. తనను అంత టార్చర్ పెట్టిన అత్తమామలు, భర్తను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఆమెకు తల్లిదండ్రులు, బంధువులే కాదు స్థానిక మహిళలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు.