ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో యాభై ఏళ్లు వచ్చే సరికే.. షుగరు, బీపీ అంటూ అన్ని రకాల జబ్బులతో ఫ్రెండ్ షిప్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే బామ్మ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. దంపుడు బియ్యం తిన్న ఒళ్లు కాబోలు.. 75 ఏళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గకుండా చాకచక్యంగా చోరీలు చేస్తోంది. అవ్వ కంట్లో బంగారు గొలుసు పడిందంటే.. అది తప్పకుండా ఆమె చేతికి రావాల్సిందే. మెడకు కూడా తెలియకుండా గొలుసు కొట్టేయడం ఈ బామ్మ టెక్నిన్ అంట. వయసు వినగానే ఏదో చిన్నా చితక దొంగ అనుకునేరు.. 75 ఏళ్ల వయసులో ఈ బామ్మ మీద 100కు పైనే చోరీ కేసులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత టాలెంటెడ్ దొంగో.
ఈ బామ్మ పేరు జవంగుల సరోజిని అలియాస్ సామ్రాజ్యం. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో జీవిస్తోంది. 75 ఏళ్ల వయసులో అందరి బామ్మల్లాగే ఈమె కూడా కృష్ణా రామా అంటూ గుడుల చుట్టూ తిరుగుతోంది. ఎక్కడ విగ్రహ ప్రతిష్ట ఉన్నా, ధ్వజస్తంభ ప్రతిష్టాుపన ఉన్నా తప్పకుండా వెళ్తుంది. ఇదంతా భక్తితో చేస్తోంది అనుకుంటే మీరు పొరబడినట్లే. బామ్మ భక్తితో కాకుండా భక్తుల మెడలో ఉండే బంగారం కోసం గుడికి వెళ్తూ ఉంటుందనమాట.
బాగా రద్దీగా ఉన్న సమయంలో భక్తులు దేవుడిని మొక్కుతూ ఏమరుపాటుగా ఉన్న సమయంలో మెడకు కూడా తెలియకుండా బంగారు గొలుసు కొట్టేస్తుంది. ఆ తర్వాత సమాన్య భక్తురాలిగా దేవుడిని దర్శించుకుని వెళ్లిపోతుంది. అలా దొరికిన దగ్గర దొరికినట్లు చేతికి పనిచెప్తూ వచ్చింది. అలా ఏకంగా 100కు పైనే గొలుసు చోరీలు చేసేసింది. పోలీసులకు అన్ని ఫిర్యాదులు వస్తున్నా ఆ అవ్వను మాత్రం పట్టుకోలేక పోయారు.
అందుకు కారణం కూడా లేకపోలేదులెండి. అక్కడున్న అందరినీ ప్రశ్నిస్తున్నా, అనుమాన పడుతున్నా ఆ బామ్మను మాత్రం పోలీసులు అనుమానించలేదు. ఎందుకంటే చూడటానికి మన బంగారు బామ్మ అంత అమాయకంగా ఉంటుందన మాట. దాంతో బామ్మ దెబ్బతో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎన్ని కేసులు వస్తున్నా పోలీసులకు మాత్రం ఆ దొంగ దొరకడం లేదు. చివరికి సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు ఆ బామ్మను పట్టుకున్నారు. సామ్రాజ్యం అనే పేరుకు తగ్గట్లుగా ఈ వయసులోనూ తన సామ్యాజ్యాన్ని విస్తరించడానికి పాటు పడుతున్న బామ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.