ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ కారణంగా యువత తప్పుదోవ పడటమే కాదు. దాని మోజులో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సమాజంలో రోజూ సెల్ ఫోన్స్ కారణంతో జనాలు చనిపోతున్నా.. మిగతా వారు మాత్రం జాగ్రత్త పడటం లేదు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లా, చందుర్తి మండలంలోని ఎన్గల్ సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్గల్ గ్రామానికి చెందిన సింగం స్వామి – రాజమణి దంపతుల కుమారుడు రంజిత్(25).. డిగ్రీ పూర్తిచేసి హైదరాబాద్ లో ఏసీ మెకానిక్ వర్క్ నేర్చుకుంటున్నాడు. హైదరాబాద్ లోనే ఉంటున్నా అని.. ఈ నెల 8న గోల్కొండ ఖిల్లా చూసేందుకు వెళ్ళాడు. అయితే.. ఖిల్లా పైభాగం వరకు చేరుకొని సెల్ఫీ తీసుకునే క్రమంలో రంజిత్ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు.
ఈ ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలు కావడంతో.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం(11న) ఉదయం తుదిశ్వాస విడిచాడు. రంజిత్ మృతదేహం స్వగ్రామం ఎన్గల్ చేరుకోగా తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. మృతుడికి తమ్ముడు రాకేష్ – ఓ అక్క ఉన్నట్లు సమాచారం. ఓ సెల్ఫీ కోసం ప్రాణాలు కోల్పుయిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.