కొందరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. వాళ్లు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబం మొత్తం క్షోభ అనుభవించాల్సి వస్తుంది అనే చిన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. దేనికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆప్షన్ కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా ఆలోచన లేకుండా ఓ యువతి ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంది.
ఈ మధ్యకాలంలో ప్రేమ అనే పదం ఎంతో ఫ్యాన్సీగా మారిపోయింది. అవసరాలు తీర్చుకోవడానికి ఆ పదాన్ని బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక, శారీరక అవసరాల కోసం ప్రేమ అనే బంధాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. అలా మోసపోయిన వాళ్లలో చాలా మంది బాధను దిగమింగి జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై ప్రతిఘటిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే యువతి ఆ కోవకు చెందిందే. అయితే ఆమెకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాడితో బాగుండేది. కానీ, ప్రియుడి ఇంటికెళ్లి అతడిని హత్య చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. గోకవరం మండలం తిరుమలపాలానికి చెందిన నాగశేషు(26) చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె రాజమహేంద్రవరంలో చదువుతున్న సమయంలోనే నాగశేషుతో పరిచయం పెరిగింది. వారి పరిచయం కాస్తా తర్వాత ప్రేమగా మారింది. నాలుగేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందో.. నాగశేషు కుటుంబ సభ్యులు అతనికి వేరే యువతితో వివాహం చేశారు. పెళ్లైన విషయాన్ని నాగశేషు డెబొర వద్ద దాచిపెట్టాడు.
ఏడాది గడుస్తున్నా ఆమెకు వివాహం గురించి చెంప్పలేదు. ఏదో విధంగా ఆమెకు నాగశేషుకు పెళ్లైన విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఆమె శివన్నారాయణ అనే తన మిత్రుడితో కలిసి బుధవారం అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబా మీద నిద్రిస్తున్న అతడిని లేపి మళ్లీ గొడవ పడింది. ఆ వివాదంలో ఆమెతో తెచ్చుకున్న కత్తిపీటతో నాగశేషుపై దాడి చేసింది. ఆమె మిత్రుడు కర్రతో నాగశేషును కొట్టాడు. అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆర్తనాదాలు చేశాడు. అతని కేకలకు చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు.
నాగశేషును అంబులెన్సులో రంపచోడవం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. కానీ, అతను మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తనకు జరిగిన అన్యాయానికి అతని ప్రాణం తీయడమే సరైంది అనుకుని ఆ యువతి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. పైగా అతడిని వివాహం చేసుకున్న మరో యువతి జీవితాన్ని కూడా చీకటి చేసింది. నాగశేషుని హత్య చేసి.. కుర్ల డెబొర చేసింది కరెక్టేనా? న్యాయపరంగా పోరాడాల్సిందా? మీ అభిప్రాయాలను కామెంట్సూ రూపంలో తెలియజేయండి.