ఒకప్పుడు భార్యాభర్తల బంధం ఎంతో అన్యోన్యంగా ఉండేది. కొట్టుకున్నా.. తిట్టుకున్నా మరుసటి రోజుకు మళ్లీ ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే వారు. కానీ నేటికాలంలో దంపతుల బంధం దారుణంగా తయరైంది. చాలా మంది దంపతులు సహనం కోల్పోయి.. ప్రతి చిన్న విషయానికి గొడవపడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ గొడవలు చివరికి హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ ప్రబుద్ధుడు కూరలో ఉప్పు తక్కువైందని భార్యతో గొడ పడ్డాడు. చివరికి ఆమెను అతి కిరాతకంగా కత్తితో పొడిచి కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్ రాష్ట్రం సరన్ జిల్లా మాంఝీ పోలీస్టేషన్ పరిధిలోని కలాన్ గ్రామంలో ప్రభురామ్(55) అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వీరి మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రభురాం భార్య వంట చేసింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. ఇక భోజన సమయంలో ఉప్పు తక్కువైందని భార్యపై కోపం పడ్డాడు. ఆరోగ్యం కోసమే కూరలో ఉప్పు తగ్గించాని ఆమె సమాధానం చెప్పింది. భార్య మాటలు వినిపించుకోని ఆ భర్త.. భార్యను తిట్టడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభురాం.. వంటగదిలో ఉన్న కత్తితో ఆమెపై దాడిచేశాడు.
తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ప్రభురామ్ కుమారుడు వినోద్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభురామ్ ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభురామ్ తాటిచెట్ల నుంచి కల్లు తీసి అమ్ముతుంటాడని చెప్పారు. కల్లు తీసే కత్తితోనే భార్యపై దాడిచేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.పాపం.. భర్త ఆరోగ్యం కోసం కూరలో ఉప్పు తక్కువ వేయడమే ఆమె చేసిన నేరమని స్థానికులు బాధ పడ్డారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబానికి అప్పగించారు.