తరతరాలుగా, యుగయుగాలుగా కులాంతర ప్రేమలు పెద్ద మూల్యాన్నే చెల్లించుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారు వేరే కులం వాళ్లతో ప్రేమలో పడితే సహించలేకపోతున్నారు. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ తల్లి కూతురి కులాంతర ప్రేమను సహించలేక పెళ్లి చూపుల రోజే ఆమె ప్రాణాలు తీసింది. ఈ సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, తిరునల్వేలిలోని సివల్‌పేరి గ్రామానికి చెందిన పిచ్చయ్, అరుముగ కని భార్యాభర్తలు.
వీరికి 19 ఏళ్ల కూతురు అరుణ ఉంది. అరుణ నర్సింగ్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అరుణ తన తల్లితో చెప్పింది. అతడినే పెళ్లి చేసుకుంటానని అంది. అయితే, అరుణ దేవర్ కులానికి చెందిన యువతి కాగా, ఆమె ప్రియుడు నాడార్ కులానికి చెందిన వాడు. దీంతో ఆమె తల్లి వీరి ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. అంతేకాదు! అరుణకు వెంటనే తమ కులానికి చెందిన వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. బుధవారం అరుణను చూడటానికి అబ్బాయి తరపు వాళ్లు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని అరుముగ కని, అరుణకు చెప్పింది.
దీంతో అరుణ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ప్రేమ విషయం పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి వాళ్లతో చెబుతానని బెదిరించింది. కూతురు అలా అనే సరికి అరుముగ కని తట్టుకోలేకపోయింది. వెంటనే కూతురి మీదకు దూకింది. ఆమె గొంతు నులిమి దారుణంగా చంపేసింది. కూతుర్ని చంపిన తర్వాత అరుముగ కని హెయిర్ డై తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అరుణ మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.