ఆమె.. పెళ్ళికి ముందు తియ్యని మాటలు చెప్పిన ప్రేమికుడితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం అందరిని వదులుకుని ప్రియుడి చెంతకు చేరింది. ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. కానీ..పెళ్ళైన నాటి నుండి ఆమెకి భర్త నరకం చూపించాడు. బిక్షం కూడా ఎత్తించాడు. చివరికి ఇష్టపడి ఒక్క చీర కొనుకున్న పాపానికి ఆమెని ఇటుక రాయితో కొట్టి చంపేశాడు. వినడానికి కూడా కోపాన్ని కలిగించే ఈ ఘటన తాడేపల్లిగూడెంలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశరావుపాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరు బూరలు, రబ్బర్ బ్యాండ్లు, చెంపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంత పేదరికంలో ఉన్నా, ఆమె భర్త దుర్గా ప్రసాద్ మద్యానికి బానిస అయ్యాడు. కొన్ని రోజుల తరువాత జూదానికి కూడా బానిస అయ్యాడు.
వీరికి ఓ పాప కూడా పుట్టింది. కానీ.., దుర్గా ప్రసాద్ అలవాట్ల కారణంగా ఇల్లు గడవడం కూడా కష్టం అయ్యింది. దీంతో.., తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేసి భర్త, అత్త మామలను పోషిస్తూ వచ్చింది దానమ్మ. కానీ.., భర్త దుర్గాప్రసాద్ మాత్రం ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్మును కూడా తన జల్సాలకు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. అడ్డుకున్న భార్య దానమ్మని గర్భిణి అని చూడకుండా కడుపుపై కాలితో కొట్టాడు. దీంతో.. దానమ్మకి 20 రోజుల క్రితం గర్భస్రావమైంది కూడా. ఇంత నరకం అనుభవించింది ఆ ఇల్లాలు.
అయితే.. ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుంది దానమ్మ. ఈ విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ ఆవేశంతో రగిలిపోయాడు. తాగడానికి డబ్బులు లేవని చెప్పి, నువ్వు చీర కొనుక్కుంటావా అని భార్య దానమ్మపై దాడికి తెగబడ్డాడు దుర్గా ప్రసాద్. ఆమె వదిలేయ్ మావ అంటూ ఎంత ప్రాధేయపడినా ఆ భర్త కణికరించలేదు. పక్కనే ఉన్న ఇటుక రాయితో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. ఆమె తలపై ఏకంగా 20 సార్లు పైగా రాయితో కొట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక దానమ్మ అరచి అరచి అక్కడే కన్నుమూసింది.
ఈ ఘటన జరిగాక చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి దుర్గా ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక తల్లిని కోల్పోయి ఆమె శవంపై పడి ఏడుస్తున్న దానమ్మ కూతురి బిత్తరచూపులు అందరిని కలచి వేస్తున్నాయి. చూశారు కదా? ఇలా బాధ్యతలు మరచి, ఆడవారి కన్నీటికి కారణం అవుతూ, వారిని కడ తేరుస్తున్న ఇలాంటి భర్తలకి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలనుకామెంట్స్ రూపంలో తెలియజేయండి.