దుమ్మాయిగూడలో 10 ఏళ్ల చిన్నారి అదృశ్యం ఆ తర్వాత చిన్నారి చెరువులో శవమై కనిపించిన కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. పాప నీటిలో పడి చనిపోవటానికి కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. తమ కూతుర్ని చంపేసి నీటిలో పడేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. పాప చెరువులో పడ్డ ప్రదేశంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాప మృతికి గల సరైన కారణాలు కనుక్కుని పాప కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య జనం డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు సైతం దిగారు. దీంతో దుమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాగ్రహం నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అయింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దుమ్మాయిగూడలో బందోబస్తు ఏర్పాటు చేసింది. శాస్త్రీయ ఆధారాల కోసం చెరవు నీటిని కూడా టెస్టింగ్‌కు పంపారు. గంజాయి తాగే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాప తల్లిదండ్రుల ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, చిన్నారి ఇందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లి రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు స్కూల్లో ఆరాతీయగా.. ఆరోజు ఉదయం స్కూల్ కి వెళ్లిన ఇందు బ్యాగ్‌ని స్కూల్లో పెట్టి.. పార్కుకి వెళ్లినట్లు తోటి పిల్లలు చెప్పారు.
అక్కడ ఎంత వెతికినా దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా పాప చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ చెరువులో పాప మృతదేహాన్ని కనుగొన్నారు. నిన్న బాలిక మృతి దేహానికి పోస్టుమార్టం పూర్తయినట్లు సమాచారం. రిపోర్టు ప్రకారం.. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో నీరు ఉంది. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు సమాచారం. శనివారం పాప మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.