సైదబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు మరణించాడు. స్టేషన్‌ఘన్పూర్ రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. చేతిపై ఉన్న పచ్చబొట్టుల ఆధారంగా అతడ్ని రాజుగా పోలీసులు నిర్ధారించారు. అందరూ ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇందులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రాజు అసలు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడని అక్కడి రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు.
జనగామ జిల్లాకు చెందిన నిందితుడు రాజు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజు అటుగా వెళ్తుండగా రైల్వే సిబ్బంది చూశారని.. వారిని చూసి రాజు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అక్కడున్న చెట్లపొదల్లో రాజు దాదాపు 10 నిమిషాలు దాక్కున్నట్లు తెలిపారు. రైల్వే సిబ్బంది వెతుకులాట ప్రారంభించడంతో ఎటు వెళ్లాలో తెలీక అలా ఉండిపోయిన రాజు.. రైలు వస్తుండగా ట్రాక్ దాటి తప్పించుకోవాలని భావించినట్లు సమాచారం. ఆక్రమంలోనే నిందితుడు రాజు రైలు ఢీకొని మరణించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని రైల్వే సిబ్బంది డయల్ 100 ద్వారా అక్కడి పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు. తర్వాత వరంగల్ సీపీ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ముఖం కాస్త చిధ్రమై ఉండటంతో చేతిపై ఉన్న పచ్చబొట్ల ద్వారా ఆధారంగా రాజుగా నిర్ధారించుకున్నారు.
మరోవైపు చిన్నారి కుటుంబసభ్యులు నిందితుడు రాజు మృతదేహాన్ని తమకు చూపిస్తే గుర్తిస్తామని పోలీసులు నిర్ధారించుకుంటే సరిపోదని డిమాండ్ చేస్తున్నారు. తాము చూసి నిర్ధారించుకునే వరకు అది రాజు మృతదేహమన్న నిర్ణయానికి రామని చెప్తున్నారు.