సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. అది రాజు శవమే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాజు ఆత్మహత్యపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఉత్కంఠరేపిన ఈ ఘటన ఒక ముగింపునకు చేరుకుంది. ఇప్పుడు నిందితుడు రాజుకు సంబంధించిన ప్రతి చిన్న అంశం ప్రజలకు ఎంతో ఆసక్తిగా మారింది. అదే క్రమంలో రాజు మృతదేహం వద్ద పోలీసులకు లభించిన వస్తువులు ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
రైలు పట్టాలపై రాజు మృతదేహం గుర్తించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం చేతులపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా అది రాజు మృతదేహంగా నిర్ధారణకు వచ్చారు. రైలు ఢీకొని అతని ముకం మొత్తం ఛిద్రం అయిపోయింది. రాజు ప్యాంటు జేబులో రెండు జియో ఫోన్లు, ఇంటి తాళం, పది రూపాయల నోటు లభించాయని తెలిపారు. ఎటు పోవాలో తెలీక, బయట తిరగాలంటే ఎప్పుడు ఎవరు గుర్తుపడతారో అన్న భయంతో బిక్కు బిక్కుమంటూ గడిపిన రాజు చివరికి శవమై దొరికాడు. అయితే, నిందితుడు రాజు కుటుంబసభ్యులు మాత్రం రాజుది ఆత్మహత్య కాదు.. పోలీసులే చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజు మృతితో సంబరపడి పోవడం కాదని ఇలాంటి రాజులు మళ్లీ తయారవుకుండా సమస్యకు పరిష్కారం వెతకాలంటూ సూచిస్తున్నారు.