సమాజంలో కొన్ని తప్పు అని తెలిసినా చాలా మంది వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకొందరు తప్పులనే వారి జీవనోపాధిగా మార్చుకుంటున్నారు. అలా ఓ మహిళ వ్యభిచారాన్ని తన జీవనోపాధిగా మార్చుకుంది. అయితే అనుకోకుండా అయిన స్నేహమే ఆమె ప్రాణాలను తీసింది. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పడుపు వృత్తిలో తనకు పోటీగా ఉందని, తనకంటే ఎక్కువ అందంగా ఉందనే అక్కసుతో స్నేహితురాలినే కడతేర్చింది ఓ మహాతల్లి. చివరికి పాపం పండి కటకటాలకు చేరింది. ఆ కేసుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు పీఎస్ పరిధిలో గతనెల ఓ గుర్తుతెలియని మృతదేహం లభించింది. గోనె సంచిలో కట్టి రోడ్డుపక్కన పడేసి వెళ్లారు. గుర్తుతెలియన్ శవంగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైనశైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గంగన్నగూడెం గ్రామానికి చెందిన అమృత.. కమ్మదనంలో నివాసముంటున్న సరిత ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ చేసేది పడుపువృత్తే కావడంతో వారి మధ్య స్నేహం ఇంకాస్త పెరిగింది. ఇద్దరూ కలిసి తాము ఎంచుకున్న మార్గంలో డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. వీళ్లిద్దరికి చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి. వారి పరిచయాలతో వృత్తిని కొనసాగిస్తున్నారు.
అయితే సరితతో పోలిస్తే.. అమృతకు పెద్దగా కస్టమర్లు రావడం లేదు. ఎందుకు అంటే అమృత కంటే సరిత కాస్త చూడటానికి అందంగా ఉంటుంది అంట. అందుకే వారి పరిచయస్తుల్లో చాలా మంది సరిత దగ్గరకే వెళ్తున్నారంట. అయితే సరిత వల్లే తనకు వ్యాపారం జరగడం లేదని అమృత మనసులో బలంగా నాటుకుంది. సరిత వల్ల తనకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని భావించింది. ఎలాగైనా సరితను అడ్డు తొలగించుకోవాలని అమృత నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా షాద్ నగర్ బస్టాండ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న లింగంతో కలిసి పథకం కూడా రచించింది. ఎలాగైనా సరిత అడ్డు తొలగించుకోవాలని పక్కాగా ప్లాన్ చేసింది. వారి పథకాన్ని అమలు చేయాలని ఫిక్స్ అయిపోయారు.
అమృత- లింగం కలిసి సరితకు బాగా మద్యం తాపించారు. మద్యం మత్తులో ఉన్న సరితను కర్రతో తల పగలగొట్టారు. రక్తం మడుగులో పడిఉన్న సరిత ముఖంపై అమృత దిండుపెట్టి ఒత్తి.. ఊపిరాడకుండా చేసింది. అలా సరితను హతమార్చిన తర్వాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి వాగు పక్కన రోడ్డుపై పడేశారు. అక్కడితే అంతా అయిపోయిందని ఆనంద పడ్డారు. అయితే శవం పక్కన దొరికిన బస్ టికెట్ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మృతరాలు సరిత అని గుర్తించిన తర్వాత ఆమెకు అమృత అనే ఫ్రెండ్ ఉందని తెలుసుకున్నారు. అదేరోజు లింగం- అమృత బైక్‌పై ఓ మూటను పెట్టుకుని వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ ఆధారంగా కనుగొన్నారు. బస్‌స్టాండ్‌లో కూడా వీరు అనుమానంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. అలా నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అత్యాసకు పోయి సరితను హత్య చేసి అమృత ఇప్పుడు జైలుపాలైంది.