రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బులకు ఆశపడ్డ ఓ వ్యక్తి తన వద్ద పని చేస్తున్న వ్యక్తిని చంపి అతని పేరు మీదున్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను కాజేయాలని చూశాడు. దీని కోసం పక్క ప్లాన్ తో అడుగులు వేసిన ఆ వ్యక్తి చివరికి అతడిని చంపి అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు, ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ బ్యాంక్ అధికారులకు కాస్త అనుమానం రావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది 2021 ఫిబ్రవరి 23. రంగారెడ్డి జిల్లా ఫరుఖ్ నగర్ మొగలిగిద్ద గ్రామ శివారులో బిక్షపతి అనే గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు బిక్షపతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులు తీగలాగితే డొంక అంతా కదిలింది. ఇన్సురెన్స్ డబ్బుల కోసమే అతడిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన షాద్ నగర్ పోలీసులు అసలు నిజాల వెలుగులోకి తెచ్చారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన బిక్షపతి అనే వ్యక్తి అనాథ ఇతనికి ఎవరూ లేరు. అయితే హైదరాబాద్ నగరానికి వచ్చిన బిక్షపతి శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద పనికి కుదిరాడు. చాలా ఏళ్ల నుంచి ఇతని వద్దే పని చేస్తూ డబ్బు బాగా సంపాదించుకున్నాడు. ఇక బిక్షపతి అతని పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకున్నాడు. ఇతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో బిక్షపతి తన ఇన్సూరెన్స్ పాలసీలో శ్రీనివాస్ ను నామినీగా చేర్చాడు. ఈ క్రమంలోనే బిక్షపతి ఆస్తులపై శ్రీనివాస్ కన్నేశాడు. బిక్షపతిని చంపితే అతని ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు అతని ఆస్తులు కూడా నేనే తీసుకోవచ్చని అనుకున్నాడు. ఇందులో భాగంగానే మల్కాజ్ గిరి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతిలాల్ సాహయాన్ని కోరాడు శ్రీనివాస్. మోతిలాల్ కూడా సరే అన్నాడు. అయితే 2021 ఫిబ్రవరి 23న శ్రీనివాస్ బిక్షపతిని నమ్మించి ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి శ్రీనివాస్ బిక్షపతికి ఫుల్ గా మద్యం తాగించాడు. ఆ తర్వాత మోతిలాల్ కు కాల్ చేసి వీరున్న చోటకు రమ్మన్నాడు.
అతనితో పాటు మరో ముగ్గురు వచ్చారు. వారు రాగానే అందరూ కలిసి మద్యం మత్తులో ఉన్న బిక్షపతిని దారుణంగా కొట్టి చంపారు. అనంతరం బిక్షపతి మృతదేహాన్ని ఫరుఖ్ నగర్ మొగలిగిద్ద గ్రామ శివారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కొంత కాలం తర్వాత శ్రీనివాస్ బిక్షపతి పేరు మీదున్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బును తీసుకోవాలని భావించి ఐసీఐసీఐ బ్యాంకును సంప్రదించాడు. అయితే ఇక్కడే శ్రీనివాస్ ప్రవర్తన మీద అనుమానం రావడంతో బ్యాంకు అధికారులు షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బిక్షపతి పేరు మీదున్న ఆస్తులు, ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలనే బిక్షపతిని చంపామని శ్రీనివాస్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ మోతిలాల్ ఒప్పుకున్నారు. చివరికి నేరం రుజువు కావడంతో పోలీసులు హెడ్ కానిస్టేబుల్ మోతిలాల్, శ్రీనివాస్ తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.