టెక్నాలజీ యుగం కొత్త పుంతలు తొక్కడంతో లాభంతో పాటు అంతకుమించిన నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఎంతో మంది నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు దేశంలో రోజుకు ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. అచ్చం ఇలాగే కొందరు మోసగాళ్లు ఏకంగా 50 వేల మంది నిరుద్యోగులను మోసం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘరానా మోసం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘడ్ ప్రాంతం. ఇక్కడే ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణుడు జాఫర్ అహ్మద్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి స్థానికంగా ముగ్గురు స్నేహితులు ఉన్నారు. అయితే బాగానే తెలివి తేటలు సంపాదించిన వీళ్లు.. కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతికారు. వారికి అప్పుడు తట్టిందే ఫేక్ నోటిఫికేషన్ వెబ్ సైట్. ఇలా ఒక ఆలోచన వచ్చిందే ఆలస్యంగా.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ‘భారతీయ జనస్వాస్థ సురక్ష యోజన,‘గ్రామీణ సమాజ్ స్వాస్థ సేవా’జీవన్ స్వాస్థ సురక్ష యోజన’అనే కేంద్ర సర్కార్ పథకాలు పేర్లు కలిసొచ్చేలా ఓ ఫేక్ వెబ్ సైట్ ను తయారు చేశారు.
ఇలా ఉత్తర్ ప్రదేశ్, ఆంద్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల నిరుద్యోగ యువతిపై కన్నేశారు. ఆ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల చేస్తున్నామన్నట్లు అనేక న్యూస్ పేపర్లకు ప్రకటనలు ఇచ్చేవారు. ఇక వారిచ్చే ప్రకటనలో కొన్ని మొబైల్ నెంబర్లు కూడా పొందుపరిచారు. ఇది ఫేక్ నోటిఫికేషన్ అని తెలియకుండా చాలా మంది నిరుద్యోగ యువతి, యువకులు వారికి ఫోన్ చేసేవారు. ఇలా పోన్ చేసిన దాదాపు 50 వేల మంది యువత వద్ద ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు అని రూ. 3000, శిక్షణ ఫీజు అని రూ. 70 వేలు అంటూ నగదును అంతా తమ తమ అకౌంట్లలోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందు కోసం జన్ సేవా కేంద్రాల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ పై 10 శాతం కమిషన్ ఇస్తామని ముందుగానే మాట్లాడుకున్నారు.
ఇలా దాదాపుగా 50 వేల మంది నిరుద్యోగ యువత వద్ద డబ్బులు తీసుకుని జాఫర్ అహ్మద్ మోసానికి పాల్పడ్డాడు. ఇక మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన సూత్రదారి అయిన జాఫర్ అహ్మద్, అతని స్నేహితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘారానా మోసం స్థానికంగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అనేక మంది నిరుద్యోగలను ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడ్డ ఈ కేటుగాళ్ల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.