Crime News: పుట్టింటికి పోయిన తన భార్యను మంత్రాలతో ఇంటికి తిరిగి రప్పిస్తానని డబ్బులు తీసుకుని, మోసం చేసిన మాంత్రికుడ్ని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని జాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, జాజ్‌పూర్ జిల్లాలోని బంధగావ్ గ్రామానికి చెందిన శాంతను బెహ్ర భార్య కొన్ని నెలల క్రితం అతడితో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. పలు సార్లు అత్తారింటికి పోయిన శాంతను భార్యను ఒప్పించి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ, అలా జరగలేదు. ఈ నేపథ్యంలోనే శాంతను మనియా బాబర్ అనే మాంత్రికుడ్ని కలిశాడు. ఆ మాంత్రికుడు శాంతను భార్యను తన మంత్రాలతో పుట్టింటినుంచి భర్త దగ్గరకు రప్పిస్తానని మాట ఇచ్చాడు. ఇందుకోసం 5 వేల రూపాయలు తీసుకున్నాడు. రోజులు గడిచాయి. కానీ, శాంతను భార్య అత్తింటికి తిరిగిరాలేదు. దీంతో శాంతనుకు మాంత్రికుడిపై బాగా కోపం వచ్చింది. డబ్బులు తీసుకుని ఏమీ చేయటంలేదని భావించాడు. మధ్యాహ్నం సమయంలో మాంత్రికుడి ఇంటికి వెళ్లాడు.
ఇదే విషయమై అతడితో గొడవపడ్డాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా గొడవ పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన శాంతను పదునైన ఆయుధంతో మాంత్రికుడిని పొడిచి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు పోయి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అసలు వీడు తండ్రేనా! కన్న కూతురిపై ఇంత నీచమా?