నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త భార్యను దిండుతో హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్(29)కు ఇదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి(27)తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు.
కొన్ని రోజుల అనంతరం వీరికి ఓ కుమారుడు, ఓ కూమార్తె జన్మించారు. భర్త ప్లంబర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి భర్త శ్రీకాంత్ భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల పిల్లలు స్కూలుకు వెళ్లగానే ఈ దంపతులిద్దరూ గొడవకు దిగారు. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను దిండుతో అదిమి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి స్వాతిని చంపేశానంటూ తెలిపాడు. ఇక అనంతరం అక్కడి నుంచి పరారైన శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఓ చిన్న అనుమానమే పచ్చని కాపురంలో చిచ్చు రేపిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.