కష్టపడి పని చేయకుండా క్షణాల్లో డబ్బు సంపాదించే మార్గం ఏదైన ఉందా అంటే అది దొంగతనం ఒక్కటే. అయితే దొంగతనం చేయడం కోసం పాతిరోజుల్లా గోడలు పగలగొట్టి, తాళాలు విరగొట్టి చెమటోడ్చాల్సిన పని లేనే లేదు. రోజులు మారాయి కాబట్టి చాలా మంది దొంగనాలను చాలా స్మార్ట్ గా, సింపుల్ గా చేసేస్తున్నారు. అచ్చం స్వామిరారా మూవీలో దొంగతనం చేసినట్టుగానే ముంబైలోని ఓ యువతి స్మార్ట్ గా దొంగతాలకు పాల్పడింది. వృద్ధులనే టార్గెట్ గా చేసుకున్న ఆ మహిళ కుదిరితే హగ్గులు, వీలైతే ముద్దులతో రొమాన్స్ చేస్తూ మోసాలకు పాల్పడింది. ఇక ముసలివాళ్లని దగ్గరకు చేర్చుకుని దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసులకు చిక్కింది. ఇటీవల ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీతా పటేల్ అనే యువతి ముంబైలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటుంది. అయితే ఈ మహిళ కష్టపడి పని చేయకుండా దొంగతనం చేయాలని ప్లాన్ గీసింది. ఇది మాములు ప్లాన్ కాదండోయ్.. ఆ మహిళ అమాయకపు చూపులతో వృద్ధులతో స్నేహం చేస్తుంది. ఇక మాటా మాటా కలిపి కుదిరితే హగ్గులు, వీలైతే ముద్దులిచ్చి రొమాన్స్ చేస్తుంది. దీనినే ఆసరాగా చేసుకుని హగ్గు ఇచ్చే క్రమంలోనే మెల్లగా పర్సులో ఉన్న డబ్బులు, మెడలో ఉన్న బంగారు గొలుసులను కాజేస్తూ కిలాడీ లేడీగా రికార్డ్ లోకి ఎక్కింది.
అయితే మలాద్ కు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఇతని రాకను గమనించిన గీతా పటేల్ నేను ముందు దిగుతానని ఆ వృద్ధుడిని లిఫ్ట్ అడిగి ఆటోలో ఎక్కింది. ఇక అతని దిగిపోయేంత వరకు అతనితో మాటా మాటా కలిపింది. చివరికి అతను ఆటో దిగగానే గీతా పటేల్ ఆ వృద్ధుడికి మత్తుతో కూడిన ఓ హగ్గు ఇస్తూనే అతని మెడలో ఉన్న బంగారు గొలుసును కొట్టేసింది. ఆ వృద్ధుడు ఇంటికి వెళ్లి చూడగా అతని మెడలో గొలుసు మాయమైంది. ఇది పక్కా గీతా పటేల్ పనేని గ్రహించిన ఆ ముసలాయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గీతా పటేల్ ను విచారించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన గీతా పటేల్.. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించేసరికి నేనే దొంగిలించానంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఇలా చాలామంది వృద్ధుల వద్ద గీతా పటేల్ దొంగతనాలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె చేసిన మోసాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చన గీతా పటెల్ అసలు మోసం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.