హైదరాబాద్ లో పబ్ కల్చర్ శ్రుతి మించుతోందని ఎప్పటినుంచో అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. యువత పెడదారి పడుతున్నారనేందుకు.. ఇటీవల జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనే ప్రధాన ఉదాహరణ. అమ్నీషియా అనే పబ్‌లో జరిగిన మైనర్ల పార్టీనే ఆ దారుణం జరిగేందుకు ముఖ్య కారణం అయ్యింది. అయితే ఆ ఘటన తర్వాత పబ్‌లపై పోలీసులు నిఘా పెరిగింది. సరైన నిబంధనలు పాటిస్తున్నారా? లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఘటన తర్వాత చాలా పబ్‌లు నిబంధనలు పాటిస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల మరో పబ్ లో మైనర్ల పార్టీ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు ఓ బడా నేత కూడా సపోర్ట్ చేశారంటూ తెలుస్తోంది.
విషయం ఏంటంటే.. అమ్నీషియా పబ్ లో వెలుగు చూసిన మైనర్ల పార్టీ తరహా ఘటనే గచ్చిబౌలిలోని ఓ పబ్ లో జరిగినట్లు తెలుస్తోంది. మైనర్లంతా కలిసి రెండ్రోజుల పాటు ఆ పబ్ లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి పార్టీకి అనుమతి కోరగా అందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ బడా లీడర్ ఆ విషయంలో జోక్యం చేసుకోవడంతో పార్టీకి అనుమతి అందినట్సు తెలుస్తోంది.
సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే మైనర్ల పార్టీకి సంబంధించిన ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. అటు పబ్ నిర్వాహకులు మాత్రం మేము ఎలాంటి మద్యం సరఫరా చేయలేదంటూ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మైనర్లను పబ్‌లకు అనుమతించొద్దు అని పోలీసులు, అధికారులు చేస్తున్న హెచ్చరికలను సైతం తోసిపుచ్చుతున్న కొన్ని పబ్ ల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.