నేటికాలంలో కొంతమంది యువతియువకులు బయటకు పొక్కకుండా ప్రేమ పేరుతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పార్కులు, సినిమాలు, షికారుల అంటూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ.. జాలిగా తిరుగుతుంటారు. ఇక ఇద్దరిది ఒకే గ్రామమైతే అర్థరాత్రి గోడలు దూకి ముచ్చట్లు కూడా పెట్టుకుంటారు. అచ్చం ఇలాగే చేయబోయిన ఓ ప్రేమ జంటను కొందరు యువకులు కాపుకాసి పోలీసుల సాయంతో పెళ్లి చేశారు. ఇక విషయం ఏంటంటే..? ఝార్ఖాండ్ రాష్ట్రం పాకూరు పరిధిలోని దేవ్ పూర్ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన దుర్యోధన సాహ అనే యువకుడు ఆ గ్రామంలోని బసంతి కుమారి అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఆమె కూడా దుర్యోధన సాహ ప్రేమకు ఓకే చెప్పింది.
కొంత కాలంగా నడుస్తున్న ఈ వ్యవహారం ఇద్దరి ఇంట్లో వాళ్లకి తెలియకుండా తిరుగుతున్నారు. ఇద్దరిది ఒకే ఊరు కావడంతో రాత్రుళ్లు ఇద్దరూ కలుసుకునే వారు. అయితే ఇటీవల దుర్యోధన సాహ తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి వాళ్ల ఇంటికి వెళ్లాడు. ప్రేయసి కూడా ప్రియుడి రాకను గమనించి మెల్లగా గడపదాటి ఇద్దరు ఇంటి వెనకాల మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్న గ్రామంలోని కొందరు యువకులు కాపుకాసి ఆ ప్రేమ జంటను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే వచ్చిన పోలీసులు ఈ జంటను స్టేషన్ కు తరలించి తల్లిదండ్రులను పిలిపించారు. దీంతో భయపడిన ఆ ప్రేమ జంట మేమిద్దరం కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామంటూ పోలీసులకు తెలిపారు. ఇక వారి నిర్ణయానికి స్వాగతించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మరుసటి రోజు ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరికి గుడిలో వివాహం చేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.