కేవలం 300 రూపాయల కోసం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితుడి లాంటి బంధువును దాడి చేసి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు వివరాల మేరకు.. కర్ణాటకలోని కలబురిగికి ప్రాంతానికి చెందిన కరీం భగవాన్, వాజిద్ ఇద్దరూ బంధువులు. పైగా స్నేహితులు కూడా. ఎప్పుడూ కలిసి తిరిగేవారు. కరీం అరటి పళ్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాజిద్ కూడా పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరికీ మందు అలవాటు ఉండటంతో స్నేహం బలపడింది. ఈ నేపథ్యంలోనే వాజిద్, కరీంకు 300 రూపాయలు అప్పుగా ఇచ్చాడు.
అయితే, నెలలు గడుస్తున్నా కరీం తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. వాజిద్ తన డబ్బు తనకు తిరిగివ్వాలని గట్టిగా అడిగేవాడు. కరీం మాత్రం తన దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇస్తానని చెప్పేవాడు. ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరిగేవి. అక్టోబర్ 16న అరటి పళ్లు అమ్మటానికి వెళుతున్నానని చెప్పి కరీం ఇంటినుంచి బయటకు వచ్చాడు. రాత్రి సమయంలో డబ్బు విషయమై కరీం, వాజిద్‌కు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో రగిలిపోయిన వాజిద్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కరీంపై దాడి చేశాడు. పొట్టలో, గొంతులో పొడిచాడు.
గొడవను ఆపటానికి వచ్చిన మరో యువకుడిపై కూడా వాజిద్ దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీంను ఆసుపత్రికి తరలించారు. అయితే, కత్తి పోట్ల కారణంగా తీవ్ర రక్త స్రావం అయిన కరీం అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.