ఈ సంక్రాంతి ఆ కుంటుంబంలో విషాదాన్ని నింపింది. భోగి రోజు మంట వేసేందుకు ఊరంత సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ ఇంట్లో మాత్రం రక్తం ఏరులై పారింది. పండుగపూట ఒక ప్రాణం పోగా.. రెండు పసి ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విషాద సంఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన బసిరెడ్డి నరసింహారెడ్డి(47).. తన కుమారుడు అభితేజ రెడ్డి, కుమార్తె పావనిపై శనివారం తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు.
దాడి సమయంలో పిల్లలిద్దరు గాఢ నిద్రలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులంతా భోజనం చేసి.. పిల్లలతో పాటు నరసింహారెడ్డి హాల్‌లో పడుకోగా.. అతని భార్య తులసమ్మ పడక గదిలో నిద్రపోయింది. శనివారం తెల్లవారుజామున అందరి కంటే ముందే నిద్రలేచిన నరసింహారెడ్డి.. భార్య నిద్రపోతున్న గదికి బయటి నుంచి గడియపెట్టి.. గాఢనిద్రలో ఉన్న కుమారుడు అభితేజ, కుమార్తె పావనిపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత.. తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రగాయాలతోనే ఆర్తనాదాలు చేస్తూ.. ఎలాగొలా పావని వాళ్ల అమ్మ ఉన్న గది తలుపులు తెరవడంతో.. అప్పటికే వారి రోదనల నిద్రలేచిన తల్లి తులసమ్మ.. రక్తకపుమడుగులో ఉన్న కొడుకుని, స్పృహలోలేని భర్తను చూసి.. గట్టిగా రోదిచింది. చుట్టుపక్కల వారొచ్చి.. ఇద్దరు పిల్లలను, నరసింహారెడ్డిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు నరసింహా రెడ్డిని పరీక్షించి.. అతను అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. విషమ పరిస్థితుల్లో ఉన్న పావనిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు, అలాగే అభితేజను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన.. పోలీసలు.. నరసింహారెడ్డి మానసిక పరిస్థితి సరిలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణ తేల్చారు. తులసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా.. కన్న తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన అభితేజరెడ్డి పదో తరగతి చదువుతుండగా.. పావని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ ఘటనతో నక్కలదిన్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగపూట ఆ కుటుంబంలో నెలకొన్న విషాదంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.