ప్రస్తుత సమాజంలో యువతీ,యువకులు హద్దు మీరుతున్నారు. ప్రేమ పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేకపోతున్నారు. చివరకు ప్రేమించిన వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ముంబైకి చెందిన శ్రద్ధా వాకర్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె ప్రియుడే ఆమెను దారుణంగా చంపేశాడు. ముక్కలు చేసి బయట పడేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు ప్రతీరోజు ఏదో ఒక ప్రాంతంలో ప్రియురాళ్లపై ప్రియుళ్లు దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ ప్రియుడు తన ప్రియురాలిని రేప్ చేసి చంపేశాడు. ఆపై ఆమె ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా యాసిడ్ పోసి కాల్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, రాంచీకి చెందిన 25 ఏళ్ల ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన దీప్ నారాయణ్ సింగ్ అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఆమె తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. ఇక, అప్పటినుంచి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 22న ఓ యువతి మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో క్వారీ దగ్గర లభించింది.
యువతి చేతులు, కాళ్లపై తాడుతో కట్టేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. శరీరంపై ఉన్న బట్టల ఆధారంగా తల్లిదండ్రులు ఆమెను గుర్తించారు. ఆమె ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు దీప్ నారాయణ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీప్ నారాయణ్ ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. తర్వాత శవాన్ని క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోశాడు. అయితే, దీప్ నారాయణ్ ఆమెను ఎందుకు చంపాడన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.