Crime News: సమాజం శాస్త్ర సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినా కొందరు మూఢనమ్మకాలను వీడటం లేదు. క్షుద్రపూజలతో మనుషుల్ని నాశనం చేయోచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే తోటి మనుషులపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, తమ కుటుంబాలపై క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో ముగ్గురు మహిళలు, ఓ మగాడిపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. వారి ఒంటిపై విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. అనంతరం మలాన్ని తినిపించి, మూత్రాన్ని తాగించి అతి క్రూరంగా ప్రవర్తించారు. ఈ సంఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జార్ఖండ్, డుమ్కా జిల్లాలోని అశ్వారీ గ్రామానికి చెందిన రాశీ ముర్ము, సన్ముని తుడు, కోలో తుడు, శ్రీలాల్ ముర్ము క్షుద్ర పూజలు చేస్తున్నారని అదే గ్రామానికి చెందిన కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. శనివారం నలుగురిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతేకాదు! నలుగురి ఒంటిపై ఇనుప కడ్డీ కాల్చి వాతలు పెట్టారు. నొప్పి తాళలేక బాధితులు కేకలు వేస్తున్నా ఆపలేదు. నిందితులు ఓ బాటిల్‌లో మలాన్ని, మూత్రాన్ని నింపారు. ఆ నలుగురితో బలవంతంగా తాగించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఓ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని డియోగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరైయహత్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆ ఆరుగురు అదే గ్రామానికి చెందిన సుందర్, బాబుజి, జ్యోతిన్, మంగల్, లుఖిరామ్, తెంగ్రీలుగా తేలింది. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇక, తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఇద్దరు బాధితులు పోలీసులను కోరారు.