ఈ యువతి పేరు మహేశ్వరి. వయసు 21 ఏళ్లు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పాత బజారులో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ నెల 12 వరకు తల్లితో గడిపిన మహేశ్వరి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారుపడ్డ మహేశ్వరి తల్లి అంతటా వెతికింది. ఇక బంధువులకు ఫోన్ చేసి మహేశ్వరి జాడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక మహేశ్వరి తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 12 నుంచి మా కూతురు మహేశ్వరి కనిపించకుండా పోయింది. మా ఎదురింట్లో ఉంటున్న కుర్రాడి మీదే మాకు అనుమానంగా ఉందంటూ మహేశ్వరి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మహేశ్వరి కనిపించకపోవడానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారం ఏమైన ఉందా? లేక ఎదురింటి యువకుడు ప్రేమకు నిరాకరించడంతోనే కిడ్నాప్ చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా కూతురు మహేశ్వరి జాడ కనిపించకపోవడంతో తల్లి, మహేశ్వరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.