టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ దిగ్గజం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దిగ్గజాన్నే ఒక భారతీయ మాజీ ఉద్యోగి కోట్లకు మోసం చేశాడు. ఏకంగా 17 మిలియన్ డాలర్ల ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలుసుకోవడానికి యాపిల్ సంస్థకు చానాళ్లే పట్టింది.
పంటను పశువుల నుంచి కాపాడేందుకు చుట్టూ కంచె వేస్తారు. కానీ, ఆ కంచే చేనుని మేస్తుందని ఎవరూ ఊహించరు. అలాంటి ఘటనే ఒకటి యాపిల్ సంస్థలో వెలుగు చూసింది. ఆ సంస్థలో పనిచేసిన ఒక భారతీయ మాజీ ఉద్యోగి ఏకంగా రూ.138 కోట్లకు యాపిల్ సంస్థను మోసం చేశాడు. పైగా పన్ను ఎగవేసి అటు ప్రభుత్వాన్ని మోసగించాడు. ఆరోపణలను అంగీకరిస్తూ.. ఆ మాజీ ఉద్యోగి తప్పుని ఒప్పుకున్నాడు. ఆ కుంభకోణం కేసులో తాజాగా తీర్పు వెలువడింది. అతనికి మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 19 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేరానికి పాల్పిడిన వ్యక్తి పేరు ధీరూ. ఇతను 2008 నుంచి 2018 వరకు యాపిల్ సంస్థలో పనిచేశాడు. ఇతను యాపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్ విభాగంలో విధులు నిర్వహించాడు. యాపిల్ సంస్థకు కావాల్సిన అన్ని విడిభాగాలు కొనుగోలు చేసేందుకు ధీరూకు అధికారం ఉంది. అతను ఎలాంటి విడిభాగాలు కావాలన్నా కొనుగోలు చేయగలడు. అక్కడే అతను అక్రమాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. కంపెనీకి అవసరం ఉందని చెప్తూ విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాడు. మరోవైపు వాటిని వేరే కంపెనీలకు అమ్మాడు. అందుకు సహకరించిన కంపెనీలకు చెల్లింపులు చేయడం, తప్పుడు ఇన్ వాయిస్ లు తయారు చేయడం చేశాడు. అలాగే ఆదాయపు పన్ను కూడా ఎగవేసినట్లు ధీరూ అంగీకరించాడు.
నిజానికి ధీరూపై అంతగా పర్యవేక్షణ ఉండేది కాదు. అతను నమ్మకంగా పని చేస్తాడు.. కంపెనీ కూడా అంతగా పట్టించుకోలేదు. దానినే ధీరూ అవకాశంగా మార్చుకున్నాడు. తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. అలా తప్పుడు మార్గంలో 17 మిలియన్ డాలర్ల వరకు సంపాదించుకున్నాడు. పైగా కంపెనీ అక్రమాలను కనిపెట్టేందుకు ఎలాంటి మార్గాలు వాడతారో కూడా అతని తెలియడంతో దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన ధీరూకు కోర్టు 3 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పైగా 19 మిలియన్ డాలర్లు కట్టాలని తెలిపింది. మూడేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినా కూడా అతనిపై మరోసారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. యాపిల్ సంస్థనే ఇన్ని కోట్లకు మోసం చేయడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.