ఆమె పేరు ఫాతిమా. కొన్నేళ్ల కిందట మీరాజ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంత కాలానికి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
మీరాజ్ అలీ-ఫాతిమ దంపతులు. వీరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని వదిలి నగరానికి వచ్చారు. ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇక భార్యాభర్తలు ఓ చోట పనికి కూడా కుదిరారు. కొన్నాళ్లకి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. భర్త కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలు కూడా పెరిగి పెద్దవారవుతున్నారు. ఈ క్రమంలోనే భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఈ దెబ్బతో వీరి సంసారం ఉన్నట్టుండి రోడ్డున పడింది. ఇంతకు ఈ దంపతుల మధ్య ఏం జరిగింది? భర్త చేసిన దారుణం ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మీరాజ్ అలీ-ఫాతిమ దంపతులు బతకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చారు. అయితే, ఈ దంపతులు గత కొంత కాలంగా ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్ లో కాపురం పెట్టారు. భర్త ఓ చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.., గత కొంత కాలంగా మీరాజ్ అలీ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను రోజూ రాత్రిళ్లు అనేక రకాలుగా వేధింపులకు పాల్పడేవాడు. ఫాతిమా.. భర్త టార్చర్ ను భరిస్తూ వచ్చింది. ఇక భార్యపై అనుమానంతో భర్త రాను రాను రాక్షసుడిలా తయారయ్యాడు.
ఎప్పటిలాగే మీరాజ్ అలీ మంగళవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన భర్త.. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డుతో భార్య ఫాతిమా తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో భార్య అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త మీరాజ్.. ఇంట్లో నుంచి పారిపోయాడు. స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.