ఈ సృష్టిలో పుట్టిన ప్రతీ జీవికి తప్పని, తప్పించుకోలేనిది ఏదైనా ఉంటే.. అది కచ్చితంగా మృత్యువే. మరణం ఎప్పుడు? ఎలా? ఎవరిని? పలకరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా సంఘటన. ఈ ఘటనలో ఓ వ్యక్తి జీవితంలోకి అనుకోని విధంగా మృత్యువు ప్రవేశించింది. గ్యాస్ సిలిండర్ నాజల్ రూపంలో అతడ్ని కబళించింది. బైకుపై వెళుతుండగా నాజల్ అతడి తలను బలంగా తాకటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఎంతో సంతోషంగా జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఉయ్యూరు ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల ప్రకాశ్ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఫ్యామిలీతో ఉంటున్నాడు. ప్రకాశ్ సౌత్‌వైర్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ప్రకాశ్ బైకుపై బీఎన్‌రెడ్డి నగర్‌లోని రోడ్డుపై వెళుతున్నాడు. అదే సమయంలో అక్కడి సూర్య ఇంజనీరింగ్ పరిశ్రమ కోసం ఆక్సిజన్ సిలిండర్లు వచ్చాయి. వర్కర్లు వాటిని వాహనంలోనుంచి కిందకు దింపుతున్నారు. ఈ సమయంలో ఓ సిలిండర్ కిందపడింది. సిలిండర్ పైనుంచి కిందపడటంతో దాని నాజిల్ ఊడి గాల్లోకి ఎగిరింది.
అది బైకుపై వెళుతున్న ప్రకాశ్ తలకు బలంగా తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశ్ హఠాత్మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య, పిల్లలు గుండెలు అవిసేలా విలపించారు. వీరి ఏడుపు విన్న వారు సైతం కంట తడి పెట్టుకున్నారు. మరి, ఈ అనుకోని విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.