ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ నేటి సమాజంలో ప్రతి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి దిగులు చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాలు, మరే ఇతర కారణాలచేతనైనా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే ఆలోచన లేకుండా తనువు చాలిస్తున్నారు. కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం సమర్థనీయం కానేకాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంతటి సమస్య వచ్చినా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం సరైన ఆలోచన కాదు. తాజాగా హైదరాబాద్ ఘట్‌కేసర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నల్లగొండకు చెందిన అశోక్, విజయ దంపతులు ఉపాధి కోసం వచ్చి ఘట్‌కేసర్‌లోని NFC నగర్ లో నివాసముంటున్నారు.
విజయ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తుంది. తను ఇంటివద్ద చిట్టీలు కూడా నిర్వహిస్తుంది. భర్త అశోక్ సొంతూరులోని ఇంటికి వెళ్లగా, పిల్లలను షాపుకు పంపించి తలుపులు వేసుకొని బెడ్‌రూంలో చీరతో విజయ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు షాపు నుండి వచ్చి ఎంతపిలిచినా పలకలేదు. దీంతో విషయం తెలిసి స్థానికులు తలుపులను పగులగొట్టి చూశారు. విజయ అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తరలించడంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయగా తిరిగి రాత్రి గాంధీ ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.