పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గాడి తప్పుతున్నారు. తమ శారీరక సుఖం కోసం విద్యార్థులను హింసించే వారు కొందరైతే.. తమ అవసరాలు, విలాసాలకోసం దొంగతనాలు, మోసాలు చేసే వారు మరికొందరు. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని తెలిసి కూడా నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన చెడు మనస్తత్వం, నేర ప్రవృత్తి కారణంగా ఉద్యోగం పోగొట్టుకోవటమే కాకుండా జైలు పాలయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటకు చెందిన సార సంతోష్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఓ మహిళా హెడ్ మాస్టర్ ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపాడన్న ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో సంతోష్ సస్పెండ్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. అయినా అతడు తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదు. ఈ సారి దొంగతనాలకు రుచి మరిగాడు. జనవరి 10న సంగారెడ్డికి చెందిన కె.రాములు బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసి బైకుపై తీసుకెళుతూ ఉన్నాడు. రాములుతో పాటు ఆ బైకుపై అతడి భార్య కూడా ఉంది. వీరిద్దరూ ఇంటికి కూరగాయలు తీసుకెళడానికి మార్గం మధ్యలో ఆగారు.
వీరిని ఫాలో అవుతూ వచ్చిన సార సంతోష్ అదును చూసి డబ్బుల బ్యాగును లాక్కున్నాడు. బైకుపై అక్కడినుంచి వెళ్లిపోయాడు. రాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. 17వ తేదీన అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. బైక్ నెంబర్ ప్లేటును తిప్పి అతడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్‌ను రిమాండ్‌కు తరలించారు.